MS Dhoni : భారత క్రికెట్లో కొన్ని జెర్సీలు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. జెర్సీ నంబర్ 10 అనగానే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), జెర్సీ నంబర్ 7 అనగానే మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)లు గుర్తుకు వస్తారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టీమిండియాపై చెరగని ముద్ర వేసిన ధోనీకి జెర్సీ నంబర్ 7తో విడదీయలేని అనుబంధం ఉంది. ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న మహీ భాయ్.. తన జెర్సీ నంబర్ 7 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘నన్ను 7వ తేదీనే కనాలని మా అమ్మానాన్న నిర్ణయించుకున్నారు. 1981లో ఏడో నెల (జూన్) 7వ తేదీన నేను జన్మించాను. ఆ ఏడాది కూడా గమ్మత్తుగా ఉంది. 8 లోంచి ఒకటి తీసేస్తే.. ఏడు వస్తుంది. అలా ఏడో నంబర్ నా జీవితంలో అంతర్భాగం. ఆ జెర్సీని అందుకే ఎంచుకున్నా’ అని ధోనీ తెలిపాడు. భారత క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన ధోనీకి బీసీసీఐ(BCCI) అరుదైన గౌరవం కల్పించింది. జెర్సీ నంబర్ 1కు శాశ్వతంగా వీడ్కోలు పలికింది. ఇకపై ఆ జెర్సీని ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయం తీసుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ
అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప కెప్టెన్‌గా కితాబులందుకున్న ధోనీ.. భారత్‌కు రికార్డు స్థాయిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతడి సారథ్యంలో టీమిండియా 2007లో పొట్టి ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత స్వదేశంలో 2011 వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2013 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ
ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రనౌట్.. మహీ కెరీర్‌కు ముగింపు పలికింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ భాయ్.. ఐపీఎల్లో కెప్టెన్‌గా తన ముద్ర వేశాడు. 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ఖు ఐదో ట్రోపీ కట్టబెట్టి సారథిగా తన సత్తా తగ్గలేదని మరోసారి చాటుకున్నాడు. 41 ఏండ్ల వయసులోనూ చెక్కెచెదరని ఫిట్నెస్తో కనిపిస్తున్న మహీ 17వ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్ బై పలికే చాన్స్ ఉంది.