హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్ రవికుమార్ బన్నెవోలు సత్తాచాటాడు. బుధవారం జరిగిన బాలుర అండర్-15 అప్టిమిస్టిక్ ఫ్లీట్‌లో బరిలోకి దిగిన రవికుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రసూల్‌పురాలోని ఉద్బవ్ స్కూల్లో చదువుతున్న రవికి తొలుత మెరుగైన ఆరంభం దక్కినప్పటికీ ఆరో స్థానానికి పడిపోయాడు.
అయితే అలలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకుసాగిన రవి..తారా అనాథ ఆశ్రమానికి చెందిన నవీన్‌ను వెనక్కి నెడుతూ టాప్‌లో నిలిచాడు. బాలికల అండర్-15 విభాగంలో తమిళనాడు యువ సెయిలర్ శ్రేయకృష్ణ ఒక దశలో 9వ స్థానానికి పడిపోయినా..అద్భుతంగా పుంజుకుని అగ్రస్థానంలోకి రాగా, లాహిరి(తెలంగాణ) రెండో స్థానంలో ఉంది. బాలుర సబ్‌జూనియర్ కేటగిరీలో తెలంగాణకు చెందిన రిజ్వాన్ మహమ్మద్ టాప్‌లో దూసుకెళుతున్నాడు. మలేషియాలో ఈనెల 16 నుంచి మొదలయ్యే యూత్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ టోర్నీకి హైదరాబాద్ నుంచి 10 సెయిలర్లు ఎంపికయ్యారు.