Durand Cup : డ్యురాండ్ కప్‌లో మొహున్ బగన్ సూపర్ జెయింట్(Mohun Bagan Super Giant) జట్టు సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం ఈస్ట్ బెంగాల్(East Bengal)తో జరిగిన ఫైనల్లో 1-0తో గెలుపొందింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో దిమిత్రి పెట్రాటోస్(Dimitri Petratos) ఏకైక గోల్ కొట్టడంతో మొహున్ బగన్ జట్టు సంబురాల్లో మునిగిపోయింది. అంతేకాదు ఈ గెలుపుతో ఈ టోర్నీలో విజయవంతమైన జట్టుగా నిలిచింది. 16 టైటిళ్లతో ఘనమైన రికార్డు ఉన్న ఈస్ట్ బెంగాల్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
టైటిల్ పోరులో ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. 62వ నిమిషంలో రెడ్ కార్డు కారణంగా స్టార్ ఆటగాడు అనిరుధ్ థాపా(Anirudh Thapa) మైదానం బయటకు వెళ్లాడు. దాంతో, 10 మందితోనే ఆడిన మొహున్ బగన్ సూపర్ జెయింట్‌కు 71వ నిమిషంలో దిమిత్రి పెట్రాటోస్ అద్భుత గోల్ అందించాడు. ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్ జట్టు ఎంత ప్రయత్నించినా గోల్ కొట్టలేకపోయింది. మూడుసార్లు ఫైనల్లో తడబడిన మొహున్ బగన్ జట్టు ఈసారి ట్రోఫీని ఒడిసి పట్టుకుంది. 2004, 2009, 2019లో ఆ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కానీ, ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. మొహున్ బగన్ జట్టు 2000 సంవత్సరంలో చివరిసారిగా డ్యురాండ్ కప్ చాంపియన్‌గా నిలిచింది.