‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ జగమెరిగిన ఈ తెలుగు సామెతకు తిరుగులేదు! అవును బలవంతుడు ఉన్న చోట బలహీనులకు చోటు లేదనేది ఈ నానుడి అర్థం. ఇప్పుడిది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారత పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా వెలుగులో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌కు సరైన గుర్తింపు లభించలేదు. ఇది మూమ్మాటికి నిజం. వేగం, స్వింగ్, ఫిట్నెస్ ఇలా ఏ రకంగా చూసినా బుమ్రా కంటే సిరాజ్ తక్కువేమి కాదు. కానీ అతడి ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని అభిమానుల ఉవాచ. 2020లో ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన నాటి నుంచి తాజాగా ముగిసిన బర్మింగ్‌హామ్ టెస్టు వరకు సిరాజ్ భారత చిరస్మరణీయ విజయాల్లో కీలకమయ్యాడు. స్వింగ్‌కు వేగాన్ని జోడిస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, వాబుల్సీమ్.. బంతితో మాయ చేసే ‘మియాభాయ్’ మరోమారు భారత్ ఆశాకిరణంగా మారాడు. బుమ్రా గైర్హాజరీలో ఆకాశ్‌దీప్‌తో కలిసి ఇంగ్లండ్ పతనంలో కీలకమైన ‘డీఎస్పీ’ సిరాజ్‌పై ప్రత్యేక కథనం.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
Mohammed Siraj | మహమ్మద్ సిరాజ్.. భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం! ఆటోరిక్షా నడపుకునే సాధారణ హైదరాబాదీ కుటుంబంలో పుట్టిన సిరాజ్ అంచలంచెలుగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ప్రస్థానం మొదలుపెట్టి స్వదేశం, విదేశమన్న తేడా లేకుండా వికెట్ల వేట కొనసాగిస్తున్న నయా స్వింగ్ సుల్తాన్ సిరాజ్. ఇప్పటి వరకు భారత్ తరఫున 38 టెస్టులాడిన సిరాజ్ 30.95 సగటుతో 109 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగుసార్లు 5 వికెట్లు, 6 సార్లు 4 వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. బుమ్రాతో కలిసి ఆడినప్పుడు 33.82 సగటు కనబరిచిన అతడు.. బుమ్రా లేని టెస్టుల్లో ఏకంగా 25.20 సగటుతో వికెట్లు నేలకూల్చాడు. ఇక్కడే స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. బుమ్రా నీడలో సిరాజ్ ప్రతిభ వెలుగులోకి రాలేదన్నది. కొత్త బంతితో నిప్పులు చెరిగే సిరాజ్.. బుమ్రాకు ఏ మాత్రం తగ్గకుండా వికెట్లు తీసిన తీరు అంకెల్లో తేటతెల్లమవుతున్నది. బుమ్రాపై అతిగా ఆధారపడే టీమ్ఇండియా మేనేజ్మెంట్కు తానున్నానంటూ సిరాజ్ మరోమారు చెప్పకనే చెప్పాడు. ఇదిలాఉంటే స్పిన్‌కు సహకరించే స్వదేశీ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపని ఈ హైదరాబాదీ విదేశాల్లో టీమ్ఇండియాకు ఆయువుపట్టుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు అతను తీసిన వికెట్లలో అధిక భాగం (90 వికెట్లు) విదేశాల్లోవే కావడం విశేషం.
ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిగా..
కెప్టెన్ బౌలర్‌గా ముద్రపడ్డ సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లకు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. అలుపెరగకుండా బౌలింగ్ చేయడంలో అందరికంటే ముందుండే అతడు తనదైన రోజున బ్యాటర్లను గడగడలాడించడంలో ముందుంటాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌లో సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన చరిత్రలో నిలిచిపోయే సందర్భం. నిర్జీవమైన పిచ్‌పై బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తూ సిరాజ్.. ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. వికెట్లను గిరాటేయడమే లక్ష్యంగా ఈ హైదరాబాదీ సంధించిన స్వింగ్ బంతులకు ఇంగ్లండ్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో దిగ్గజ రూట్‌తో పాటు ప్రమాదకర స్టోక్స్‌ను సిరాజ్ ఔట్ చేసిన తీరు నభూతో నభవిష్యత్. లెగ్‌సైడ్ ఊరించే బంతితో రూట్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్..సూపర్ బౌన్సర్‌తో స్టోక్స్‌ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్ పంపాడు.
ఇన్నేండ్ల టెస్టు కెరీర్లో స్టోక్స్ తొలిసారి డకౌట్‌గా వెనుదిరిగిన క్షణం అభిమానులు మరిచిపోలేనిది. ఇంగ్లండ్ గడ్డపై ఇన్నేండ్లుగా ఊరిస్తున్న ఐదు వికెట్ల ప్రదర్శనను సొంతం చేసుకున్న సిరాజ్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్దీప్నకు అండగా నిలిచిన తీరు ప్రస్తావించదగినది. బుమ్రా లేని లేటును ఏమాత్రం కనిపించకుండా టీమ్ఇండియా పేస్ దళానికి నాయకత్వం వహిస్తూ ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణకు మార్గనిర్దేశం చేసిన పద్ధతి మరువలేనిది. అయితే ఈ అద్భుత ప్రదర్శన వెనుక సిరాజ్ మొక్కవోని దీక్ష దాగున్నది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా ప్రభలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సిరాజ్ సమయం వచ్చినప్పుడల్లా సత్తాచాటుతూనే ఉన్నాడు.
గోడకు కొట్టిన బంతిలా:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఎంపికలో సెలెక్టర్లు అనూహ్యంగా సిరాజ్‌ను పక్కకు పెట్టారు. పాత బంతితో బంతిని సరిగ్గా స్వింగ్ చేయడం లేదనే అపవాదుతో సిరాజ్‌కు ఏమాత్రం తలతూగని హర్షిత్ రానాను ఎంపిక చేశారు. దుబాయ్ పిచ్‌లపై రానా ప్రదర్శన చూసిన అభిమానులు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఇక్కడే సిరాజ్ తనలో మేటి బౌలర్‌ను నిద్రలేపాడు. దేశవాళీ సీజన్ రంజీల్లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన సిరాజ్..విదర్భతో మ్యాచ్‌లో అదరగొట్టి తనపై వచ్చిన విమర్శలకు బంతితోనే సమాధానం చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటాడనే ముద్రను చెరిపేస్తూ గుజరాత్ తరఫున 15 మ్యాచ్‌ల్లో 32.93 సగటుతో 16 వికెట్లు తీశాడు. ఇందులో 151 డాట్‌బాల్స్ వేసి ఔరా అనిపించుకున్నాడు. ఇలా తన ప్రతిభకు మరిన్ని మెరుగులు అద్దుకున్న సిరాజ్..అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు.
జాంటీ సిరాజ్..
సిరాజ్ పేస్ బౌలర్‌గానే కాదు మెరుపు ఫీల్డర్‌గానూ మన్ననలు పొందుతున్నాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో జడేజా బౌలింగ్‌లో జోష్ టంగ్ కొట్టిన షాట్‌ను ముందుకు దూకుతూ అమాంతం ఒక్కచేత్తో సిరాజ్ అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ‘మహమ్మద్ జాంటీ సిరాజ్’ అంటూ భారత క్రికెట్ దిగ్గజ సచిన్ పొగిడిన తీరే దీనికి నిదర్శనం. మేటి ఫీల్డర్లను మరిపిస్తూ ఒక పేసర్ ఇలాంటి క్యాచ్ పట్టడాన్ని అభిమానులు ఫిదా అవుతున్నారు. సహచర హైదరాబాదీ, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ శిక్షణలో రాటుదేలిన సిరాజ్ బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.