ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా నిరుడు వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని షమీ ఫిట్నెస్ను అంచనా వేసేందుకు సెలెక్టర్లు ఈ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో 14 నెలల తర్వాత షమీ టీమ్ఇండియాకు ఆడబోతున్నాడు.
వాస్తవానికి గాయం నుంచి తేరుకున్న ఈ స్వింగ్ బౌలర్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాలన్న పట్టుదలతో ముస్తాక్ అలీ టోర్నీలో సత్తాచాటాడు. అయితే ఆఖర్లో కాలిమడమకు తిరిగి వాపు రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందాడు.
ఈ కారణంగా బీజీటీ సిరీస్‌లో షమీ సేవలు భారత్‌కు అందుబాటులో లేకపోవడం బౌలింగ్ భారమంతా బుమ్రాపై పడింది. ఐదు టెస్టుల్లో విరామం లేని బౌలింగ్ చేసిన బుమ్రా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి షమీని సిద్ధం చేస్తున్నారు.
సూర్య సారథ్యంలో: కోల్‌కతా వేదికగా ఈనెల 22 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్‌యాదవ్ వ్యవహరించనున్నాడు. శాంసన్, అభిషేక్, హార్దిక్, రింకూసింగ్ జట్టులో నిలుపుకోగా, మెల్బోర్న్ హీరో నితీశ్‌కుమార్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
అక్షర్‌పటేల్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. షమీకి తోడు అర్ష్‌దీప్‌సింగ్, హర్షిత్రానా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సుందర్, అక్షర్ స్పిన్ దళాన్ని నడిపించనున్నారు. జితేశ్శర్మ స్థానంలో వికెట్‌కీపర్, బ్యాటర్‌గా ధృవ్ జురెల్‌కు అవకాశమిచ్చారు. అంతకుమించిన భారీ మార్పులేమి లేవు.
జట్టు వివరాలు: సూర్యకుమార్(కెప్టెన్), అక్షర్‌పటేల్(వైస్ కెప్టెన్), శాంసన్, అభిషేక్, తిలక్‌వర్మ, హార్దిక్, రింకూసింగ్, నితీశ్‌కుమార్, హర్షిత్, అర్ష్‌దీప్‌సింగ్, షమీ, చక్రవర్తి, బిష్ణోయ్, సుందర్, జురెల్.
తొలి టీ20: కోల్‌కతా: జనవరి 22
రెండో టీ20: చెన్నై: జనవరి 25
మూడో టీ20: రాజ్‌కోట్: జనవరి:28
నాల్గో టీ20: పుణె: జనవరి 31
ఐదో టీ20: ముంబై: ఫిబ్రవరి 2