Mohammed Shami | వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. ఈ కీలక పర్యటన ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. వీరిద్దరి తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా పలు వైబ్‌సైట్స్ వార్త కథనాలను ప్రచురించాయి. ఆ వార్తలపై మహ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. తమ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డాడు.
అయితే, రోహిత్, విరాట్ కోహ్లీ బాటలోనే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సైతం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా మహ్మద్ షమీ స్పందించాడు. తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వెబ్సైట్ ప్రచురించిన వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. ‘చాలా బాగుంది మహరాజ్. మీరు మీ ఉద్యోగానికి పలికేందుకు రోజులు లెక్కబెట్టుకోండి. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. మీ లాంటి వ్యక్తులు మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పాలి. ఈ రోజు ఇది చాలా చెత్త కథనం. ఏమనుకోకండి సారీ’ అంటూ స్పందించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. పలువురు షమీకి మద్దతు తెలిపారు. ఫేక్ న్యూస్ రాసే వారికి సరైన రీతిలోనే సమాధానం ఇచ్చావంటూ అభినందించారు.
ఇదిలా ఉండగా.. షమీ ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ జూన్ 3న ముగియనున్నది. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ త్వరలోనే జట్టును ప్రకటించబోతున్నది. అలాగే, టెస్టు జట్టుకు కెప్టెన్‌ను ప్రకటించనున్నది. శుభ్‌మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనకు సీనియర్ బౌలర్ అయిన మహమ్మద్ షమీని ఎంపిక చేస్తారా? లేదా? చూడాల్సిందే. 34 ఏళ్ల మహమ్మద్ షమీ 64 టెస్ట్ మ్యాచ్‌ల్లో 122 ఇన్నింగ్స్‌లలో 229 వికెట్లు పడగొట్టాడు.
ఈ ఫార్మాట్లో షమీ ఆరు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన షమీ.. భారతదేశం తరపున 108 వన్డేల్లో 206 వికెట్లు, 25 టీ20 మ్యాచ్‌లలో 27 వికెట్లు పడగొట్టాడు. అయితే, షమీ ఇటీవల ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా రోజుల తర్వాత క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి ముందు మళ్లీ జాతీయ జట్టులో చేరాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతున్నాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. షమీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.