కోల్‌కతా : ఇటీవల ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణించిన షమీ.. తాజాగా రంజీ సీజన్ రెండో మ్యాచ్‌లో ఫైఫర్‌తో సత్తాచాటి తన జట్టు (బెంగాల్)ను విజయతీరాలకు చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో షమీ ఫైఫర్ (5/38.. తొలి ఇన్నింగ్స్‌లో 3/44)తో కోల్‌కతాలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా ప్రదర్శనతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భాగంగా సెలక్టర్లు షమీ పేరును పరిగణనలోకి తీసుకుంటారా? లేక మళ్లీ మొండిచేయి చూపుతారా? అనేది ఆసక్తికరం. ఇక ఈ విజయంతో ఎలైట్ గ్రూప్-సీలో బెంగాల్ (12 పాయింట్లు).. సర్వీసెస్ (13) తర్వాత రెండో స్థానంలో ఉంది.
సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హైదరాబాద్.. రెండో మ్యాచ్‌నూ డ్రాతోనే ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో పుదుచ్చేరిని 126 పరుగులకే కుప్పకూల్చిన హైదరాబాద్.. ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టును ఆలౌట్ చేయలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పుదుచ్చేరి 97/5 స్కోరుచేసింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 435 రన్స్ చేసిన విషయం విదితమే.