Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) పునరాగమనానికి మరింత సమయం పట్టనుంది. వన్డే ప్రపంచ కప్ అనంతరం మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో ఇంగ్లండ్ సిరీస్‌లో ఆఖరి మూడు టెస్టులకు ఈ స్పీడ్‌స్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన షమీ.. తన కూతురు ఐరా(Aaira)ను ఎంతో మిస్ అవుతున్నట్టు తెలిపాడు.
‘ఎవరైనా సరే పిల్లల్ని, కుటుంబాన్ని మిస్ కాకుండా ఉంటారా. కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఇప్పుడు నా సిట్యుయేషన్ అంతే. నేనైతే నా కూతురిని బాగా మిస్ అవుతున్నా. అప్పుడప్పుడూ మాత్రమే తనతో మాట్లాడడం సాధ్యమవుతోంది. ఎంతైనా సొంత రక్తాన్ని ఎవరూ వదులుకోలేరు కదా. నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, అన్నింటిలో సక్సెస్ అవ్వాలని ఒక తండ్రిగా ఆశిస్తున్నా. జహన్‌కు నాతో విడాకుల విషయంతో సంబంధం లేకుండా అమైరా సంతోషకరమైన జీవితం గడపాలి అని కోరుకుంటున్నా’ అని షమీ అన్నాడు.
హసిన్ జహన్, షమీ
మోడల్ అయిన హసిన్ జహన్(Hasin Jahan)ను షమీ 2014లో పెండ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది ఈ జంటకు అమైరా జన్మించింది. అయితే.. 2018లో షమీపై గృహ హింస కేసు పెట్టిన జమన్.. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కోర్టు తీర్పు ఇంకా రాలేదు. ప్రస్తుతానికి అమైరా తల్లి హసిన్ వద్దనే ఉంటోంది. దాంతో, ఆమెను కలిసేందుకు షమీ ఎంత ప్రయత్నించినా జహన్ అడ్డుపడుతోంది.
అర్జున అవార్డు అందుకున్న షమీ
నిరుడు స్వదేశీ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 24 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టైటిల్ పోరులోనూ షమీ మూడు వికెట్లు తీసినా.. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించాడు. దాంతో, కంగారూ జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. నిరుడు అత్యుత్తమంగా రాణించిన షమీ ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు.