కంటేశ్వర్ అక్టోబర్ 10 : జిల్లా కేంద్రంలో మైదానాలు లేకపోయినప్పటికీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బసవ గార్డెన్లో తైక్వాండో (Taekwondo)టోర్నమెంట్ క్రీడల మూడు రోజుల పోటీలను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నా.. రాష్ట్రం సర్కార్ మాత్రం తగిన ప్రోత్సాహం ఇవ్వకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ను ఆయన విమర్శించారు.
జిల్లా కేంద్రంలో క్రీడా మైదానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం, క్రీడాకారులకు అన్ని వసతుల కల్పించే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నాగమణి, జిల్లా యువజన శాఖ అధికారి పవన్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.