జనగామ చౌరస్తా, జనవరి 18: ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో వరంగల్, నల్లగొండ విజేతలుగా నిలిచాయి. గురువారం హోరాహోరీగా జరిగిన బాలుర ఫైనల్లో వరంగల్ 51-35తో నల్లగొండపై ఘన విజయం సాధించింది. బాలికల తుదిపోరులో నల్లగొండ 48-42తో వరంగల్పై గెలిచింది. పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ ‘విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయస్థాయికి వెళుతున్న ప్లేయర్లకు తగిన ప్రోత్సాహం అందిస్తాం’ అని అన్నారు. విజేతలకు, రన్నరప్ జట్లకు ఆయన ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాము, చైర్పర్సన్ జమున, కౌన్సిలర్లు, వెంకటేశ్వర్లు, రవి కుమార్, హెచ్ఎం శ్రీనివాస్, ఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.