చాంగ్జౌ: ప్రతిష్టాత్మక చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేయగా లక్ష్యసేన్ మరోసారి తొలి రౌండ్ విఘ్నాన్ని దాటలేక చతికిలపడ్డాడు. ప్రణయ్.. 8-21, 21-16, 23-21తో 18వ ర్యాంకర్ జపాన్ షట్లర్ కొకి వతనబెను ఓడించాడు. మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్.. రెండో గేమ్‌లో పుంజుకున్నాడు. మూడో గేమ్‌లో 2-11తో వెనుకబడ్డప్పటికీ స్వల్ప వ్యవధిలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి రేసులోకొచ్చాడు. అదే జోరులో ఐదు మ్యాచ్ పాయింట్లు దక్కించుకోవడంతో ప్రణయ్ గెలుపు ఖరారైంది. మరో పోరులో లక్ష్యసేన్.. 21-14, 22-24, 11-21తో ఐదో సీడ్ చైనా ఆటగాడు లి షి ఫెంగ్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయతో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో సూర్య-అమృత ద్వయం, రోహన్ కపూర్-రుత్విక గద్దె జోడీ సైతం తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది.