Indonasia Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. సింగిల్స్‌లో సింధు, డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా.. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ (Karunakaran) – ఆద్యా వరియత్ (Aadya Variyath) ద్వయం సైతం అదరగొట్టింది. అలవోకగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఇదే విభాగంలో పోటీపడిన భారత క్రీడాకారులు తొలి రౌండ్లోనే ఓటమితో ఇంటిదారి పట్టారు.
ఇండోనేషియా ఓపెన్‌లో కరుణాకరన్ – ఆద్యా వరియత్ జోడీకి తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. అయినా సరే పట్టుదలగా ఆడిన భారత మిక్సడ్ జంట చైనీస్ తైపీకి చెందిన యె హాంగ్ వీ, నికొలె గొంజలెస్ చాన్ ద్వయాన్ని మట్టికరిపించింది. ఉత్కంఠగా సాగిన పోరులో 15-21తో తొలి సెట్లో ఓడినా ఒత్తిడికి లోనవ్వలేదు కరుణాకరన్, ఆద్యా. 45 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్టు జరిగిన మ్యాచ్‌లో భారత రాకెట్ ద్వయం 21-16, 21-17తో చివరి రెండు సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించింది.
Just in: Aadya Variyath/Sathish Kumar knock OUT WR 16 Taiwanese pair!
With 15-21, 21-16, 21-17 win in the opening round, the Indian pair advance into Pre-QF of Mixed Doubles at Indonesia Open (Super 1000). #IndonesiaOpen2025 pic.twitter.com/gqk7i0ay24
— India_AllSports (@India_AllSports) June 4, 2025
మిక్సడ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – రుత్దికా శివానీ గడ్డే జోడీకి మాత్రం నిరాశే మిగిలింది. యుచీ షిమొగమీ, సయక హొబర(జపాన్) చేతిలో భారత ద్వయం 14-21, 9-21 చిత్తుగా ఓడిపోయింది. అశిత్ సూర్య – అమృత ప్రముతేశ్ జోడీకి సైతం మొదటి రౌండ్లోనే చుక్కుదురైంది. ఫేవరెట్ అయిన ధ్రువ్ కపిల – తనీషా క్రాస్టో ద్వయం కూడా ముందంజ వేయలేకపోయింది. సెకండ్ సీడ్ టాంగ్ జీ చెన్, ఈ వీ తోహ్(మలేషియా)లకు కనీసం పోటీ ఇవ్వలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది.