ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ( Government schools ) విద్యార్థుల సంఖ్య పెరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగిందని, పాఠశాల విద్యార్థులతో కళకళలాడేలా, విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా త్వరలో చేపట్టబోయే బడిబాట కార్యక్రమంలో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.