నల్లగొండ విద్యావిభాగం(రామగిరి), జాన్ 04 : టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నల్లగొండ జిల్లా నాయకుడు ఆవుల సంపత్‌కుమార్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మనోరమ హోటల్లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ ని అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్ యాజమాన్యం జిల్లాలోని విద్యార్థులను మభ్యపెడుతూ టాలెంట్ టెస్టుల పేరుతో పరీక్షలు నిర్వహించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అలాగే విద్యార్థుల మేధస్సును అంచనా వేయడానికి టాలెంట్ టెస్ట్ లు నిర్వహించడం, ఇంటర్వ్యూలు పెట్టడం నిషేధం అన్నారు.
కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ అనుమతి లేకున్నా, నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. టాలెంట్ టెస్టుల కారణంగా విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన విద్యార్థుల్లో అంతరాలు ఏర్పడి నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని సమానత్వం అనే స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని, వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ, సాయి పాల్గొన్నారు.