ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఊహించని పేరు రేసులోకి వచ్చింది. ఇంతవరకూ టీమ్ఇండియా తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ పేరు అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, కిరణ్ మోరేతో పాటు ఒకదశలో సచిన్ టెండూల్కర్ కూడా బీసీసీఐ అధ్యక్షుడు అవనున్నారంటూ వార్తలు వచ్చినా అనూహ్యంగా మన్హాస్ ఆ స్థానాన్ని దక్కించుకోనున్నట్టు బోర్డు వర్గాల వినికిడి.
ఈనెల 28న ముంబైలో జరుగబోయే ఏజీఎంలో బోర్డు అధ్యక్ష, ఇతర పదవులకు ఎన్నికలు జరుగనుండగా నామినేషన్ దాఖలుకు ఆదివారం (సెప్టెంబర్ 21) చివరి రోజు కావడంతో మన్హాస్ ఆ ప్రక్రియను పూర్తిచేశాడు. అధ్యక్ష పదవికి మన్హాస్ ఒక్కడే నామినేషన్ వేసినట్టు సమాచారం. ఏజీఎం ముగిశాక బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా మిథున్ పేరును అధికారికంగా ప్రకటించడం లాంఛనమే అని తెలుస్తున్నది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ విషయాన్ని ఖాయం చేశారు. ‘అధ్యక్ష పదవికి మిథున్, ఉపాధ్యక్షుడిగా నేను, ట్రెజరర్‌గా రఘురామ్ భట్ పోటీ చేస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.
శనివారం రాత్రి ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి నివాసంలో ముగిసిన సమావేశంలో రాజీవ్ శుక్లా, బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హాజరవగా అక్కడే మన్హాస్ పేరు ఖరారైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం మన్హాస్కే ఓటు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు రఘురామ్ భట్ పేరు కూడా అధ్యక్ష రేసులో వినిపించినా అతడు ట్రెజరర్‌గా నామినేషన్ దాఖలు చేశాడు.