హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుండి 800 మంది హాజరయ్యారు. ముందుగా మంత్రి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ప్రపంచంలోని అనేక దేశాలు క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తాయని, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం క్రీడలకు సరైన ప్రోత్సాహం అందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. క్రీడ అంటే కేవలం క్రికెట్ ఒక్కటే కాదని, అనేక క్రీడలు ఉన్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మంత్రి తలసాని సూచించారు. క్రికెట్ పై వచ్చే ఆదాయంలో కొంతనైనా ఇతర క్రీడల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ సెక్రెటరీ రాజేష్ తివారీ, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్, ట్రెజరర్ సతీష్, తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ బుచ్చిబాబు గౌడ్, ప్రెసిడెంట్ శంకర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, సుదీప్ కుమార్, దయానంద్ రెడ్డి, నాగరాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.