హనుమకొండ, నవంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ నగరంలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి నాలుగు రోజుల క్రితమే అధికారికంగా ఆరంభించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిన దానికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉన్నది. హంగు, ఆర్భాటాల మధ్య కొత్తగా ఏర్పాటైన స్పోర్ట్స్ స్కూల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. 40 ఏండ్ల క్రితం వరంగల్‌లో నిర్మించిన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్), హాస్టల్ భవనాల్లోనే దీన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే జేఎన్ఎస్లో క్రీడాకారుల వసతుల కల్పనకు సరైన నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
నూతన స్పోర్ట్స్ స్కూల్లో నాల్గవ తరగతి కోసం 50 అడ్మిషన్లు ఖరారు చేశారు. ఇందుకోసం 55 మంది మాత్రమే హాజరయ్యారు. అడ్మిషన్ పొందిన వారికి కావాల్సిన శిక్షణ, వసతి సౌకర్యాలు కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన స్పోర్ట్స్ స్కూల్లో తగిన ఏర్పాట్లు లేకపోవడంపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. పైకి పటారం..లోన లొటారం అన్నట్లు స్పోర్ట్స్ స్కూల్ పరిస్థితి ఉన్నట్లు పలువురు ప్లేయర్లు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఇప్పుడు రీజినల్ హాస్టల్‌ను స్పోర్ట్స్ స్కూల్ అని చెబుతున్నదని సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు విమర్శిస్తున్నారు. దీనికి తోడు మొదట 80 మందికి అడ్మిషన్ ఇస్తున్నట్లు చెప్పి 50కే పరిమితం చేశారని వారు పేర్కొన్నారు.
సాధారణంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియాన్ని 16 ఎకరాల విస్తీర్ణంలో 1985లో నిర్మించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్ కోసం కొత్త భవనం, పలు క్రీడా సదుపాయాలు లేకుండా హడావుడిగా జేఎన్ఎస్లో ప్రారంభించి అడ్మిషన్లు ఇచ్చింది. వాస్తవంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ప్లేయర్లు రాణించాలంటే స్పోర్ట్స్ స్కూల్ కమ్ ఎక్సలెన్సీ సెంటర్ అవసరముంటుంది. ప్రస్తుతమున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారు ఎంచుకున్న క్రీడల్లో అత్యుత్తమ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు క్రీడా శిక్షణా వసతులు కావాలి. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో 11 క్రీడాంశాల్లో ప్రస్తుతానికి శిక్షణ అందిస్తున్నారు.
ఇందులో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్(బాలురు, బాలికలు), రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, లాన్‌టెన్నిస్, ఖోఖో, వాలీబాల్ ఉన్నాయి. దాదాపు అన్నింటికీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే కోచ్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి వాటికి అసలు కోచ్‌లే లేరు. మొత్తంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తరగతుల నిర్వహణకు అవసరమైన భవనాలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ స్కూల్ మెటీరియల్‌ను అందించడంలో విఫలమై విమర్శల పాలవుతున్నది.