హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించిన తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. కైరో వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లో ఇషా 25 మీటర్ల విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్లో కాంస్యం.. 10 మీటర్ల వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ఇషాను సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఇషా సింగ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.