Mike Hesson : వన్డేలు, టీ20ల్లో చెత్త ఆటతో నిరాశపరుస్తున్న ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయ తీసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన మైక్ హెసన్ (Mike Hesson) ను వైట్ బాల్ కోచ్‌గా నియమించింది. అకీబ్ జావేద్ స్థానంలో మైక్‌ను నూతన కోచ్‌గా ఎంపిక చేసినట్టు మంగళవారం పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘న్యూజిలాండ్ మాజీ ఆటగాడైన మైక్ హెసన్‌ను పాకిస్థాన్ పురుషుల వన్డే, టీ20 కోచ్‌గా నియమించాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అంతర్జాతీయంగా కోచ్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన మైక్‌కు ఘనమైన రికార్డు ఉంది. అతడి నాయకత్వంలో పాకిస్థాన్ వైట్ బాల్ క్రికెట్లో గొప్ప విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నా. పాక్ జట్టులోకి మైక్‌కు స్వాగతం’ అని పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తెలిపాడు.
Mike Hesson will take charge as Pakistan’s new white-ball coach https://t.co/Zhsmx04IuB pic.twitter.com/Rggt5qSRvr
— ESPNcricinfo (@ESPNcricinfo) May 13, 2025
యాభై ఏళ్లున్న మైక్‌కు కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరకు డైరెక్టర్‌గా సేవలందించాడు. ఆ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాద్ యునైటెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ జట్టు అద్భుతంగా రాణించింది. దాంతో, మైక్‌ను పాకిస్థాన్ వన్డే, టీ20 జట్లకు ప్రధాన కోచ్‌గా నియమిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పీసీబీ భావించింది. త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్(Bangladesh)తో పొట్టి సిరీస్‌తో మైక్‌కు తొలి సవాల్ ఎదురుకానుంది.
అయితే.. వ్యక్తిగత వైఫల్యానికి కోచ్‌లను బలి పశువును చేయడం పాక్ క్రికెట్లో పరిపాటి. టీ20 వరల్డ్ కప్ తర్వాత అప్పటి కోచ్ గ్యారీ కిరెస్టెన్ (Gary Kirsten)తో విభేదించిన పాక్ క్రికెటర్లు మైక్‌కు ఎంతవరకు సహకరిస్తారు? అతడు ఎన్ని రోజులు పాక్ కోచ్‌గా కొనసాగుతాడు? అనేది తెలియాల్సి ఉంది.
మైక్‌కు కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. 2012 నుంచి 2018 వరకూ అతడు కివీస్ జాతీయ జట్టుకు ఇంచార్జిగా ఉన్నాడు. అతడి హయాంలో న్యూజిలాండ్ మూడు ఫార్మట్లలో అదరగొడుతూ.. చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఇక ఐపీఎల్లో ఏకంగా నాలుగేళ్లు ఆర్సీబీకి మైక్ డైరెక్టర్‌గా పని చేశాడు. వేలంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనడం నుంచి.. బెంగళూరు జట్లు ప్రదర్శనతో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ మాజీ ప్లేయర్ ఐపీఎల్ టైటిల్ కలను మాత్రం సాకారం చేయలేకపోయాడు. దాంతో, 2024లో ఆర్సీబీ అతడిపై వేటు వేసింది. అనంతరం మైక్‌ను పీఎస్ఎల్ అక్కున చేర్చుకున్న విషయం తెలిసిందే.