T20 World Cup 2026 : నిరుడు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించిన భారత జట్టు (Team India) పొట్టి కప్‌లో భంగపడింది. తొలిరెండు మ్యాచుల్లో అదిరే విజయాలు సాధించనా.. కఠినమైన ప్రత్యర్థి ఎదురవ్వగానే చేతులెత్తేసింది. ఆదివారం దక్షిణాఫ్రికా చేతిలో ఓటమికి మరిజానే కాప్(81 నాటౌట్) విధ్వంసం ఓ కారణమైతే.. టీమిండియా మిడిలార్డర్ వైఫల్యం మరో కారణం. ప్రతిసారి ఓపెనర్లనే నమ్ముకుంటున్న హర్మన్‌ప్రీత్ సేన తదుపరి రెండు మ్యాచుల్లో గెలిస్తేనే సెమీస్ బరిలో నిలుస్తుంది. లీగ్ దశ దాటాలంటే మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాల్సిందే.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఏ ఒక్కరిద్దరిని నమ్ముకుంటే కప్ కొట్టలేం. ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకొని ఆడితేనే విజయం సిద్ధిస్తుంది. ఈ సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తుంది కాబట్టే ఆస్ట్రేలియా ఆరుసార్లు పొట్టి వరల్డ్‌కప్‌ను తన్నుకుపోయింది. మరి.. తొలిసారి వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు సమిష్టితత్వం కొరవడడంతో పొట్టి వరల్డ్‌కప్‌లో తొలి ఓటమి చవిచూసింది.
3 for 14 against Pakistan, 3 for 6 against Netherlands, 3 for 29 against South Africa https://t.co/fYt3ugWMY2
— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు త్వరగా ఔటవ్వగా.. భారీ స్కోర్ ఆశలు ఆవిరయ్యాయి. పాకిస్థాన్‌పై, నెదర్లాండ్స్‌పై మెరిసిన ఈ ఇద్దరూ విఫలమైన వేళ నిలబడాల్సిన మిడిలార్డర్ సైతం తేలిపోయింది. అనంతరం ఆల్‌రౌండర్ మరిజానే కాప్(81 నాటౌట్)ను ఔట్ చేయలేక మ్యాచ్ అప్పగించేసిన భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉంది.

ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఆదివారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధాన(17)ను శుభారంభమే ఇచ్చింది. కానీ, ఆమెను మరిజానే కాప్ బౌల్డ్ చేయడంతో.. షఫాలీ వర్మ(31)పై ఒత్తిడి పడింది. అయినా దూకుడుగా ఆడిన షఫాలీని షబ్నం ఇస్మాయిల్ బోల్తా కొట్టించగా స్కోర్ వేగానికి అడ్డుకట్ట పడింది.
ఓపెనర్లు ఔటయ్యాక యస్తికా భాటియా(15), జెమీమా రోడ్రిగ్స్(12)లు క్రీజునంటుకొని భాగస్వామ్యం నిర్మించడంలో విఫలమయ్యారు. ఎప్పటిలానే మాకు తప్పదంటూ బాధ్యత తీసుకున్నారు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(24), దీప్తి శర్మ(29)లు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను కాచుకొని స్కోర్ బోర్డును నడిపించారు. ఆఖర్లో ధనాధన్ ఆడే రీచా ఘోష్ 15 పరుగులే చేయడంతో టీమిండియా 157కే పరిమితమైంది.
భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు 19.1 ఓవర్లలోనే ఉఫ్‌మనిపించింది. దాంతో, హ్యాట్రిక్ విజయం చేజారగా హర్మన్‌ప్రీత్ సేన 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లారా వొల్వార్డ్త్ బృందం మూడో స్థానంలో కొనసాగుతున్నా తదుపరి రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌ను ఓడించడం ఆ జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు.
South Africa win by 6 wickets. #TeamIndia will now shift their focus to the next game against Bangladesh!
Scorecard ▶️ https://t.co/cIrb7Ekn0x#T20WorldCup | #WomenInBlue | #SAvIND pic.twitter.com/AfxIJJgxXh
— BCCI Women (@BCCIWomen) June 21, 2026
అదే జరిగితే.. ఆరు ఎనిమిది పాయింట్లతో సఫారీ టీమ్ సెమీస్ రేసులో నిలుస్తుంది. అందుకని.. టీమిండియా సెమీస్ చేరాలంటే జూన్ 25న బంగ్లాదేశ్‌ను.. జూన్ 28న ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాలి. లేదంటే.. ఆరు పాయింట్లతో టాప్‌లో ఉన్న ఆసీస్.. పాకిస్థాన్ చేతిలో ఓడినా భారత్‌కు కలిసొస్తుంది.