నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : భారత్ క్రికెట్లో మరో తురుపుముక్క! 17 ఏండ్ల వయసులోనే గంటకు 147 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే బౌలర్ వెలుగులోకి వచ్చాడు. ‘పిట్టకొంచెం కూత ఘనమ’న్నట్లు టీనేజ్లోనే అంచనాలకు మించి రాణిస్తున్నాడు. వాయువేగాన్ని తలపిస్తూ బ్యాటర్లకు సింహస్వప్నంలా నిలిచేలా ఆ కుర్రాడు వేసే బంతులకు అందరూ ఫిదా అవుతున్నారు. మెరుపు వేగానికి సూపర్ స్వింగ్‌ను జోడిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్న ఆ యువ క్రికెటరే తమిళనాడుకు చెందిన ప్రణవ్ రాఘవేంద్ర. ఇంగ్లండ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న ప్రణవ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలువడంలో ఓ ఆసక్తికర కథ ఉంది. ‘నేను డాక్టర్ అయ్యేవాణ్ని.. యాక్టర్‌ను అయ్యానంటూ’ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యం మనకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే కోవలో అథ్లెట్‌గా ట్రాక్‌పై చిరుతను తలపించిన ప్రణవ్..ఫాస్ట్‌బౌలర్‌గా రూపాంతరం చెందా డు.
ఓ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు వ్యక్తిగత ఈవెంట్ అయిన అథ్లెట్స్ కాకుండా టీమ్గేమ్ అయిన క్రికెట్లోకి ప్రణవ్ రంగప్రవేశం చేశాడు. అప్పటికే జరిగిన ఓ 100మీటర్ల స్ప్రింట్‌ను ప్రణవ్ 13.76సెకన్లలో పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. ప్రణవ్ అలాగే అథ్లెటిక్స్‌లో కొనసాగి ఉంటే భారత క్రికెట్ ఓ అద్భుత నైపుణ్యమున్న ఫాస్ట్బౌలర్ను కోల్పోయేది. తాను పరుగులో ఎంత వేగమో అదే దూకుడును బౌలింగ్‌లోనూ కొనసాగిస్తూ 16 ఏండ్ల వయసులోనే గంటకు 139కి.మీ మార్క్ అందుకుని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దృష్టిలో పడ్డాడు. ఇక్కడే ఈ యువ క్రికెటర్ కెరీర్ మలుపు తిరిగింది. మెక్‌గ్రాత్ మార్గనిర్దేశంలో చెన్నైలో నడిచే ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్.. ప్రణవ్‌కు ఓనమాలు నేర్పింది. ‘ప్రణవ్‌కు మంచి లైన్ అండ్ లెంగ్త్ ఉంది. నేను తొలిసారి అతన్ని చూసినప్పుడు గంటకు 130కి.మీల వేగంతో బంతులు వేశాడు. కానీ ఈ రెండేండ్ల వ్యవధిలో అతనిలో చాలా మార్పు వచ్చింది. వేగం అనేది అతనికి సహజంగా వచ్చింది. ఇప్పుడు ప్రణవ్ నిలకడగా 135 నుంచి 145కి.మీల వేగంతో బంతులు వేస్తున్నాడు. అతను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అతన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది.
వేగంగా బౌలింగ్ చేయాలంటే ఫిట్నెస్ చాలా కీలకం’ అని ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ సెంథిల్నాథన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ప్రణవ్..బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన సత్తాఏంటో చూపెట్టాడు. 17 ఏండ్ల వయసులో 147కి.మీల వేగంతో బంతులు వేసి భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. కేవలం పేస్ వరకే పరిమితం కాదన్న ప్రణవ్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘నాకు వేగమంటే ఇష్టం, బౌలింగ్ ఫాస్ట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తా. మెరుపు వేగంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ బౌన్సర్లు వేయడాన్ని బాగా ఇష్టపడుతా. బుల్లెట్లా దూసుకొచ్చే బంతి బ్యాటర్..గ్లౌవ్స్‌కు తాకుతూ ఔటయ్యే సందర్భం మాటల్లో వర్ణించలేనిది. కానీ దాని కోసం చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఫిట్నెస్ను కాపాడుకోవాలి. సరైన విధంగా బౌలింగ్ చేయాలంటే అందుకు తగ్గట్లు స్కిల్సెట్తో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. అలాగైతేనే వచ్చే ఏడాది జరుగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగల్గుతా’ అని ధీమాగా చెప్పుకొచ్చాడు. పేస్ పిచ్‌లకు స్వర్గధామమైన ఇంగ్లండ్‌లోనూ ప్రణవ్ ఇదే తరహాలో ఇరగదీస్తే అతనికి తిరుగుండకపోవచ్చు.