Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కొత్త క్లబ్ తరఫున తొలి టైటిల్ గెలిచాడు. ఎన్నో రోజుల నిరీక్షణకు తెరదించుతూ రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్ జెర్సీ వేసుకున్న ఎంబాబే ఆ జట్టు ట్రోఫీ విజయంలో భాగమయ్యాడు. ఆగస్టు 14 బుధవారం జరిగిన యూఈఎఫ్ఏ సూపర్ కప్ (UEFA Super Cup 2024) ఫైనల్లో రియల్ మాడ్రిడ్ 2-0తో అట్లాంటా (Atlanta)పై జయకేతనం ఎగురవేసింది. దాంతో ఎంబాపే మస్త్ ఖుషీ అవుతున్నాడు.
‘అది నిజంగా గొప్ప రాత్రి. నాకైతే చాలా గొప్ప క్షణం. అన్నిటికంటే ముఖ్యమైనది మాడ్రిడ్ తరఫున మేము టైటిల్ గెలిచాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో నేను గోల్ కొట్టడం ఇంకా తృప్తనిచ్చింది. నాలాంటి స్ట్రయికర్‌కు అది చాలా ప్రధానం. ఏది ఏమైనా ఈ జట్టుతో ఆడడం చాలా బాగుంది. మేము రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లం. మాకు హద్దన్నదే లేదు. ఒకవేళ నేను 50 గోల్స్ కొట్టినా.. అంతిమంగా మాకు విజయమే ముఖ్యం. జట్టుగా మరింత పరిణితి చెందడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే జట్టగానే కదా మేము గెలిచేది’ అని ఎంబాబే తెలిపాడు.
ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన ఎంబాపే 2007లో మొనాకో క్లబ్ నుంచి పారిస్ సెయింట్ జర్మనీ (Paris Saint Germany) చేరాడు. అప్పటి నుంచి ఏడేండ్లు ఆ క్లబ్‌కు ఆడాడు. పీఎస్జీ తరఫున 306 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 255 గోల్స్ కొట్టడమే కాకుండా 108 గోల్స్ చేయడంలో సహచరులకు సహాయం చేశాడు. కొత్త సీజన్‌కు ముందు పీసీజీతో ఏడేండ్లుగా ఉన్న బంధానికి ఎంబాపే బై బై చెప్పేశాడు.
రెండేండ్ల క్రితం ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఎంబాపే అదరగొట్టాడు. అర్జెంటీనా(Arjentina)తో హోరాహోరీగా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ (Hat-trick Goals) కొట్టి లియోనల్ మెస్సీ సేనను వణికించాడు. కానీ, అనూహ్యంగా షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. జట్టుకు వరల్డ్ కప్ అందించలేకపోయిన ఎంబాపే.. అత్యధికంగా 8 గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బూట్’ అవార్డు అందుకున్నాడు.