న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మే 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చారు. ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ను .. అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. లాజిస్టిక్స్ కారణాల వల్ల వేదికను మార్చినట్లు పేర్కొన్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్ దీనికి సంబంధించిన విషయాన్ని ద్రువీకరించారు. బీసీసీఐ మమ్మల్ని రిక్వెస్ట్ చేసిందని, దాన్ని అంగీకరించామని ఆయన తెలిపారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఇవాళ అహ్మదాబాద్‌కు వస్తోందని, ఇక పంజాబ్ కింగ్స్ ప్రయాణ ప్రణాళికలు త్వరలో తెలుస్తాయని పటేల్ వెల్లడించారు. గురువారం రోజున ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడనున్నది. ఈ మ్యాచ్ యధావిధిగా జరగనున్నది. ఇండోపాక్ సరిహద్దుల్లో షెల్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర, పశ్చిమ నగరాల్లో ఉన్న విమానాశ్రయాలను మూసివేశారు. కొన్నింటిలో ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. మిలిటరీ దాడుల నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయంలో కమర్షియల్ విమానాలను రద్దు చేశారు.