WIW vs ENGW : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచ్.. ఓడితే ఇంటికే వెళ్లాల్సిన దశలో మాజీ చాంపియన్ వెస్టిండీస్ (West Indies) పంజా విసిరింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ ఛేదనలో ఓపెనర్ కియన్ జోసెఫ్(52), కెప్టెన్ హేలీ మాథ్యూస్(50)లు ఆకాశమే హద్దుగా చెలరేగి విజయానికి గట్టి పునాది వేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడగా లక్ష్యం కరుగుతూ వచ్చింది. అనంతరం డియాండ్ర డాటిన్ (27) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టింది. విండీస్ విజయానికి 6 పరుగుల వద్ద ఆమె ఔటైనా.. అలెనే (8) రెండు ఫోర్లు బాదడంతో విండీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, రెండోసారి టైటిల్ వేటలో ముందంజ వేయాలనుకున్న ఇంగ్లండ్ కల చెదిరింది.
వరల్డ్ కప్‌లో చావోరేవో పోరులో ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, వెస్టిండీస్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. అటాకింగ్ గేమ్ ఆయుధంగా వెస్టిండీస్ ఓపెనర్లు కియానా జోసెఫ్(52), హేలీ మాథ్యూస్(50)లు బౌండరీలతో చెలరేగారు. తొలి ఓవర్లోనే మాథ్యూస్ సిక్సర్‌తో డేంజరస్ బెల్స్ మోగించింది. మరోవైపు జోసెఫ్ కూడా తగ్గేదేలే అన్నట్టు పోటా పోటీగా ఫోర్లు బాదేసింది. దాంతో.. ఇంగ్లండ్ బౌలర్లను వణికిపోగా.. 6వ ఓవర్లో మాథ్యూస్ మూడు ఫోర్లు కొట్టడంతో స్కోర్ 67కు చేరింది. పవర్ ప్లే తర్వాత కూడా ఇద్దరూ జోరు తగ్గించకపోవడంతో విండీస్ 10 ఓవర్లకు 89 పరుగులు కొట్టింది.
CONFIRMED ✅
West Indies have made it through to the ICC Women’s #T20WorldCup 2024 semi-finals 🤩#WhateverItTakes pic.twitter.com/eo0G5vKN9Y
— T20 World Cup (@T20WorldCup) October 15, 2024
సీవర్ బ్రంట్ వేసిన 13వ ఓవర్లో జోసెఫ్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద వ్యాట్ చేతికి చిక్కడంతో 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికీ విండీస్ విజయానికి 40 రన్స్ కావాలంతే. కానీ, అర్ధ శతకం తర్వాత భారీ షాట్ ఆడిన మాథ్యూస్ ఔట్ అయింది. అంతే.. మ్యాచ్ సమీకరణం బాల్‌కు ఒక పరుగుకు మారింది. కానీ, క్రీజులోకి వచ్చిన విధ్వంసక హిట్టర్ డియాండ్ర డాటిన్(27) 16వ ఓవర్లో వరుసగా 4, 6, ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచింది. ఆమె రెచ్చిపోవడంతో అప్పటివరకూ ఏదో మూలన విజయంపై ఇంగ్లండ్ పెట్టుకున్న ఆశలు పటాపంచలు అయ్యాయి. ధనాధన్ ఆడిన డాటిన్ మూడో వికెట్‌కు క్యాంప్‌బెల్(5) జతగా 32 పరుగులు చేసింది. అయితే.. ఎకిల్‌స్టోన్ ఓవర్లో షాట్ ఆడబోయి బౌల్డ్ అయింది. జట్టును విజయతీరాలకు చేర్చింది.
గ్రూప్ బీ నుంచి సెమీస్ బెర్తు దక్కాలంటే గెలవక తప్పని మ్యాచ్.విండీస్ కెప్టెన్ మాథ్యూస్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. ఓపెనర్లు మైయ బౌచియర్(14), డానియల్ వ్యాట్(16)లు ధనాధన్ ఆడినా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. టాపార్డర్ విఫలమైంది. కరీబియన్ సారథి మాథ్యూస్ డేంజరస్ వ్యాట్‌ను బోల్తా కొట్టించింది. దాంతో, 29 వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే అలిసే క్యాప్సే(1) రనౌట్ కావడం.. బౌచియర్ను అఫీ ఫ్లెచర్ వెనక్కి పంపడం చకచకా జరిగిపోయాయి. 34 పరుగులకే టాపార్డర్ పెవిలియన్‌లో.
Stepping up in the big games, always 🙌
FOLLOW: https://t.co/ENqk7q6eAK | #T20WorldCup pic.twitter.com/ef2fl13q9P
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2024
ఆ దశలో కెప్టెన్ హీథర్ నైట్(21 రిటైర్డ్ హర్ట్), నాట్ సీవర్ బ్రంట్(57 నాటౌట్)లు బాధ్యతగా ఆడారు. బ్రంట్ అయితే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును ఉరికించింది. నాలుగో వికెట్‌కు 60 పరుగుల జోడించింది. నైట్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యతను బ్రంట్ భుజాన వేసుకుంది. ఆమెకు టెయిలెండర్లు అమీ జోన్స్(7), గిబ్సన్(7)లు సహకరించారు. ఇక 20వ ఓవర్లో సోఫీ ఎకిల్‌స్టోన్(7) భారీ సిక్సర్, బ్రంట్ ఓ బౌండరీ బాదేయడంతో ఇంగ్లండ్ స్కోర్ 140 దాటేసింది. విండీస్ బౌలర్లలో ఫ్లెచర్(3/14) మాత్రమే రాణించింది.