ముంబై: బ్యాటర్లు సత్తాచాటినా.. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో మన అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మొదటి పోరులో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది.
దీప్తి శర్మ (15 బంతుల్లో 36 నాటౌట్; 8 ఫోర్లు), రిచా ఘోష్ (36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), స్మృతి మందన (28), దేవిక వైద్య (25), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21), షఫాలీ వర్మ (21) తలా కొన్ని పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 18.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (89 నాటౌట్; 16 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది.