కొత్తపల్లి, డిసెంబర్ 27: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో నిధులు పెంచాయని, పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహాంగా పలు జిల్లాల నుంచి హాజరైన మాస్టర్ అథ్లెట్స్లను చూస్తే సంతోషంగా ఉందన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డీ. వెంకటరామయ్య. మేడ్చల్ జిల్లా వాసి. వయస్సు 90 ఏండ్లు. రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా షార్ట్ఫుట్లో బంగారు పతకం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. జావెలిన్ త్రో తో పాటు 3 కిలోమీటర్ల వాకింగ్, 100 మీటర్ల పరుగు పందెంలో సైతం పతకాలు సాధించి అబ్బురపరిచాడు. వెంకటరామయ్య.. ఇటీవల హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాడు.