జెరుసలాం: గాజాలో తీవ్ర దుర్భిక్ష(Gaza Starvation) పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. సంపూర్ణంగా గాజా మొత్తం కరువు పరిస్థితి ఉన్నట్లు సుమారు వందకు పైగా అంతర్జాతీయ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ సంస్థలు సంయుక్తంగా ప్రకటన రిలీజ్ చేశాయి. ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో ఆకలి చావుల సంఖ్య పెరుగుతోంది. అక్కడకు విదేశీ ఆహారం కూడా అందడం లేదు. సామూహికంగా ఆకలి చావులు చోటుచేసుకుంటున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయి. గాజాలోకి ఆహారాన్ని తరలించడంలో ఇజ్రాయిల్ సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 33 మంది పోషకాహార లోపంతో ప్రాణాలు విడిచినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాలోని అన్ని సరిహద్దులను ఇజ్రాయిల్ కంట్రోల్ చేస్తోంది. అయితే బోర్డర్ వద్ద సుమారు 950 ట్రక్కుల ఆహార పదార్ధాలు ఉన్నాయి. అయితే వాటిని పంపిణీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. అన్ని వైపులా దిగ్భంధం చేయడంలో గాజాలో మరణ మృందగం మోగుతున్నట్లు అంతర్జాతీయ ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.