Masaba Gupta : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా(Masaba Gupta) వెటరన్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్(Viv Richards) కూతురు అని తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా(Neena Gupta), రిచర్డ్స్‌ల సంతానమైన మసాబా సమయం దొరికితే చాలు తండ్రి గురించి బోలెడు విషయాలు చెబుతుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిచర్డ్స్ గొప్ప ఆటగాడు అయినప్పటికీ క్రికెట్లో ఎంతో వివక్షను ఎదుర్కొన్నాడని తెలిపింది. ఇప్పటికీ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన కంట తడి పెట్టుకుంటారని ఆమె చెప్పింది.
‘మా నాన్న జాతివివక్షను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది నాకు ఈమధ్యే తెలిసింది. ఈ రోజుకు కూడా నేను ఆ విషయం ప్రస్తావిస్తే ఆయన కండ్ల వెంట నీళ్లు వస్తాయి. రేసిజం బలంగా ఉన్న కాలంలో ఆయన క్రికెటర్‌గా ఎదిగారు. ఒంటిరంగు ఆధారంగా ప్రతిభను కొలిచే కాలంలో మా తండ్రి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. నల్లజాతీయులపై వివక్ష ఇప్పటికీ ఉంది. ఆ రక్కసికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసేంత వరకూ అది కొనసాగుతూనే ఉంటుంది’ అని మసాబా చెప్పింది.
నీనా గుప్తా, వివ్ రిచర్డ్స్, మసాబా
ఈమధ్యే నటుడు సత్యదీప్ మిశ్రా(Satyadeep Mishra)తో మసాబా పెండ్లి అయింది. ఏప్రిల్ నెలలో ఆమె తాను గర్భం దాల్చినట్టు వెల్లడించింది. ఆ సమయంలో కొందరు రసగుల్లాలు బాగా తిను. పుట్టబోయే బిడ్డ తక్కువ బరువు ఉంటుంది అని, నీ బిడ్డ నల్లగా ఉండకూడదు అని మరికొందరు తనకు మెసేజ్‌లు పంపారని ఆమె తెలిపింది. ఇక రిచర్డ్స్ విషయానొకిస్తే.. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లలో ఒకడు. 1974లో ఆయన టెస్టుల్లో భారత్‌పైనే అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్ తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అంతేకాదు ఒకే వన్డేలో హాఫ్ సెంచరీ, ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆటగాడిగా రిచర్డ్స్ చరిత్రపుటల్లోకెక్కాడు. భారత పర్యటనలోనే అతడికి, నీనా గుప్తాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే.. మసాబా పుట్టాక ఇద్దరూ విడిపోయారు. కానీ, ఇప్పటికీ తమ కూతురైన మసాబాను రిచర్డ్స్ కలుస్తూనే ఉంటాడు. 1991లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రిచర్డ్స్ కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు.