మాలె: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (ఎంఎంపీఆర్సీ) సోమవారం విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో తెలిపింది. ‘మేము వారికి ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. భారత జట్టును స్వాగతించడం, వారి విజయోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం మాకు గొప్ప గౌరవం’ అని ప్రకటనలో పేర్కొంది.
గెలవకుండానే నజరానా
భువనేశ్వర్: ఏదైనా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పోటీపడి పతకాలు గెలిచొచ్చిన క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున నగదు బహుమానాలు అందజేయడం సర్వసాధారణం. కానీ ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాత్రం అందుకు భిన్నంగా తమ రాష్ట్రం నుంచి పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన ఇద్దరు ఆటగాళ్లకు రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. భారత హాకీ జట్టులో ఉన్న అమిత్ రోహిదాస్, అథ్లెట్ కిషోర్ జెనా ఒడిషాకు చెందినవారే.