Mahavir Phogat : విశ్వ క్రీడల్లో పసిడి పోరు ముందు అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)కు దేశమంతా అండగా నిలుస్తోంది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఒలింపిక్ పతకాన్ని కోల్పోయిన ఆమె అనూహ్యంగా రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ నేపథ్యంలో గరువారం వినేశ్ మేనమామ మహవీర్ ఫోగట్ (Mahavir Phogat) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఒలింపిక్స్‌లో పతకం గెలిచేందుకు వంద మంది వినేశ్ ఫోగట్‌లను తాను తయారు చేయగలనని మాజీ రెజ్లర్ అన్నాడు. వినేశ్ పతకం చేజార్చుకోవడంతో కలత చెందిన మహవీర్ తాజాగా ఏఎన్ఐతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘ఈసారి రెజ్లింగ్‌లో మనకు గోల్డ్ మెడల్ ఖరారైంది. కానీ, అనూహ్యంగా వినేశ్ అనర్హతకు గురైంది. అందువల్ల బాధతో ఆమె రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చింది.
#WATCH | “…Olympic Gold medal was confirmed this time but she got disqualified. It hurts and hence she has decided this. Once she is back, we all will try to make her understand if she is ready to contest in the next Olympics, says Vinesh Phogat’s uncle Mahavir Phogat on her… pic.twitter.com/5RAUq0XcCq
— ANI (@ANI) August 8, 2024
అయితే.. స్వదేశం వచ్చాక ఆమెతో మాట్లాడుతా. వచ్చే ఒలింపిక్స్(2028) సన్నద్ధత గురించి చర్చిస్తాను. నా మేనకోడలు పతకం చేజార్చుకోవడం వెనక ఎలాంటి కుట్ర లేదు. అయితే.. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అదించడం కోసం నేను వంద మంది వినేశ్ ఫోగట్‌లను తయారు చేయగలను’ అని మహవీర్ వెల్లడించాడు.
అంతేకాదు తన కూతురు సంగీతతో కూడా ఒలింపిక్స్‌లో పోటీపడడంపై మాట్లాడుతానని ఆయన తెలిపారు. మాజీ రెజ్లర్ అయిన మహవీర్ యువ రెజ్లర్లకు శిక్షణ ఇవ్వడంలో నేర్పరి. రెజ్లింగ్‌లో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు ప్రకటించింది. అదే ఏడాది మహవీర్ జీవిత కథాంశంతో బాలీవుడ్లో ‘దంగల్’ (Dangal) సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్ర పోషించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.
మూడో ఒలింపిక్స్ ఆడుతున్న వినేశ్ ఫోగట్ ఈసారి 53 కిలోల బదులు 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. తొలి బౌట్‌లోనే వరల్డ్ నంబర్ 1 లీ సుసానీకి చెక్ పెట్టిన వినేశ్.. ఆ తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ (Oksana Livach)ను మట్టికరిపించింది. ఇక సెమీ ఫైనల్లోనూ ఉడుంపట్టుతో విజృంభించిన ఆమె క్యూబా రెజ్లర్‌ను 5-0తో చిత్తు చేసింది.
దాంతో, ఫైనల్‌కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు నెలకొల్పింది. ఇక ఫైనల్లో గోల్డ్ మెడల్‌తో దేశాన్ని గర్వించేలా చేయాలనుకున్న వినేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. 50 కిలోల కంటే అదనంగా 100 గ్రాములు ఉందని నిర్వాహకులు ఆమెపై అనర్షత వేటు వేశారు. దాంతో, కోట్లాదిమంది ‘అదొక పీడకల అయి ఉంటే బాగుండు’ అంటూ సోషల్ మీడియాలతో తమ బాధను తెలియజేస్తున్నారు.