e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home స్పోర్ట్స్ మెద్వెదెవ్‌ ముందంజ

మెద్వెదెవ్‌ ముందంజ

మెద్వెదెవ్‌ ముందంజ

క్వార్టర్స్‌కు చేరిన రష్యా యంగ్‌ గన్‌ఫెదరర్‌ వాకొవర్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: అంచనాలకు అనుగుణంగా సాగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6-2, 6-1, 7-5తో క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ)పై సునాయాస విజయం సాధించాడు. మట్టికోట మహారాజు రఫేల్‌ నాదల్‌ తరహాలో.. ఎర్రమట్టిపై తనకు ఎదురులేదన్నట్లు విజృంభిస్తున్న మెద్వెదెవ్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గంటల 4 నిమిషాల్లో ముగిసిన పోరులో మెద్వెదెవ్‌ 14 ఏస్‌లు సంధించగా.. గారిన్‌ ఒక్కటంటే ఒక్క ఏస్‌ కూడా కొట్టలేకపోయాడు. డానియల్‌ 46 విన్నర్‌లతో సత్తాచాటితే.. 11 విన్నర్లకే పరిమితమైన గారిన్‌కు ఓటమి తప్పలేదు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ సిట్సిపస్‌ (గ్రీస్‌) 6-3, 6-2, 7-5తో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఫెదరర్‌ నుంచి వాకొవర్‌ లభించడంతో బెరెటిని (ఇటలీ) కూడా క్వార్టర్స్‌కు చేరాడు.

తప్పుకున్న ఫెదరర్‌
ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నాడు. మట్టికోర్టులో మెరుగైన రికార్డులేని ఫెదరర్‌.. ఈ నెల ఆఖర్లో ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో సత్తాచాటేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాడు. ‘నా టీమ్‌తో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నా. మోకాళ్ల శస్త్రచికిత్సల తర్వాత దాదాపు ఏడాదిన్నరగా గ్రౌండ్‌కు దూరంగా ఉన్నా. నా శరీరం చెప్పిన విధంగా నడుచుకుంటున్నా’ అని ఫెదరర్‌ పేర్కొన్నాడు. మూడో రౌండ్‌లో నాలుగు సెట్‌ల పాటు పోరాడి నెగ్గిన 39 ఏండ్ల ఫెదరర్‌ తప్పుకోవడంతో సెమీస్‌లో నాదల్‌ (స్పెయిన్‌), జొకోవిచ్‌ (సెర్బియా) మధ్య పోరు జరిగే అవకాశాలున్నాయి.

క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న-ఫ్రాంకో సుగొర్‌ (క్రొయేషియా) జోడీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరుగాల్సిన ప్రిక్వార్టర్స్‌లో బోపన్న ప్రత్యర్థులు వాకొవర్‌ ఇవ్వడంతో ఈ జోడీ ముందడుగు వేసింది. క్వార్టర్స్‌లో పాబ్లో అండుజర్‌-పెడ్రో మార్టీన్జ్‌ (స్పెయిన్‌) ద్వయంతో బోపన్న జంట తలపడనుంది.

సెరెనా ఔట్‌
మహిళల విభాగంలో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో సెరెనా 3-6, 5-7తో 21వ సీడ్‌ ఎలెనా రిబాకినా (కజకిస్థాన్‌) చేతిలో ఓటమి పాలైంది. 31వ సీడ్‌ అనస్తసియా పాలిచెంకోవా (రష్యా) పదేండ్ల తర్వాత క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ప్రిక్వార్టర్స్‌లో అనస్తసియా 5-7, 6-3, 6-2తో విక్టోరియా అజరెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో జిడాన్సెక్‌ (స్లొవేనియా) 7-6 (7/4), 6-1దో సొరానా కిర్స్‌టీ (రొమేనియా)పై గెలువగా.. బడోసా (స్పెయిన్‌) చేతిలో ఓటమిపాలైన వాండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌) ప్రిక్వార్టర్స్‌లోనే పోరాటం ముగించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెద్వెదెవ్‌ ముందంజ

ట్రెండింగ్‌

Advertisement