Ranji Trophy Record | రంజీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్ విజయ పరంపర కొనసాగుతున్నది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన విదర్భపై మధ్యప్రదేశ్ జట్టు 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ప్రస్తుత సీజన్లో మధ్యప్రదేశ్‌కు ఇది నాలుగో వరుస విజయం. ఈ జట్టు తమ గ్రూప్‌లో 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. నాలుగో రోజు వికెట్ నష్టానికి 13 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను విదర్భ ప్రారంభించింది. కెప్టెన్ ఫైజ్ ఫజల్ (65) అర్ధ సెంచరీతో రాణించాడు. కాగా విదర్భ జట్టును ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవేశ్ ఖాన్ 5 వికెట్లు తీసి పడగొట్టాడు. అవేశ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు. గౌరవ్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. దాంతో మధ్యప్రదేశ్ జట్టు విదర్శపై 205 పరుగుల తేడాతో గెలిచింది.
కాగా, ఈ రంజీ సెషన్లో ముంబై జట్టు తొలి డ్రా ఆడింది. తమిళనాడు 380/4 వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించి.. 548 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రదేశ్ రంజన్పాల్ (169), విజయ్ శంకర్ (103) సెంచరీలతో రాణించారు. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు తన రెండో ఇన్సింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. యశస్వి 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డ్రాతో ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉన్నది. మరోవైపు హర్యానా-ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.