Nathan Lyon : కొంత కాలంగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆస్ట్రేలియా (Australia) ఈసారి విజయంపై ధీమాతో ఉంది. భారత్, ఆసీస్‌ల మధ్య నవంబర్‌లో ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కంగారూ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి స్వదేశంలో జరుగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తమను ఇబ్బంది పెట్టే బ్యాటర్ ఎవరో లియాన్ చెప్పేశాడు.
అలాగని అతడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు చెప్పాడనుకుంటే పొరపాటే. బీజీటీలో యువకెరటం యశస్వీ జైస్వాల్ నుంచి ఆసీస్‌కు ప్రమాదం ఉందని లియాన్ అన్నాడు. ‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు మాకు యశస్వీ నుంచే ముప్పు ఉండనుంది. నేను ఇప్పటి వరకూ అతడికి బౌలింగ్ చేయలేదు. అతడిని అడ్డుకోవడం మా బౌలర్లకు పెద్ద పరీక్షే. ఇంగ్లండ్(England)పై అతడు ఆడిన తీరు అమోఘం. యశస్వీ బ్యాటింగ్ వీడియోలు జాగ్రత్తగా చూశాను. యశస్వీ చాలా అద్భుతంగా ఆడాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్లే(Tom Hortley)తో చాలాసేపు మాట్లాడాను. యశస్వీని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నా’ అని లియన్ తెలిపాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన లియాన్ ఖాతాలో 503 టెస్టు వికెట్లు ఉన్నాయి. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతం. పైగా విరాట్ కోహ్లీపై ఈ స్పిన్నర్‌కు మంచి రికార్డు ఉంది. 23 మ్యాచుల్లో ఏకంగా ఏడుసార్లు విరాట్ వికెట్ సంపాదించాడు. అందుకని ఈసారి బీజీటీలో భారత బ్యాటర్లు లియాన్‌పై ఓ కన్నేసి ఉంచక తప్పదు.
టెస్టు క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యానికి భారత్ చెక్ పెట్టింది. కంగారూ జట్టును వాళ్ల దేశంలోనే ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుపొందింది. వరుసగా నాలుగు పర్యాయాలు భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో, 2017 తర్వాత ఒక్కసారి కూడా ఆసీస్ బీజీటీ ట్రోఫీని గెలవలే. దాంతో.. ఎలాగైనా సరే ఈసారి బీజీటీని ఒడిసిపట్టాలని కమిన్స్ బృందం పట్టుదలతో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1992 తర్వాత తొలిసారి ఐదు టెస్టుల మ్యాచ్‌గా జరుగనుంది.