Nathan Lyon : అమూల్యంగా భావించే వస్తువులను భద్రంగా దాచుకుంటాం. అదే క్రికెటర్లు అనుకోండి.. తమ కెరీర్లో ముఖ్యమైన సందర్భాలకు సాక్ష్యమైన వాటిని పదిలంగా చూసుకుంటారు. బ్యాటర్లు అయితే.. సెంచరీ కొట్టిన బ్యాట్‌ను అపురూపంగా చూసుకుంటారు. ఇక బౌలర్లు అనుకోండి బంతిని తమ మైలురాయికి గుర్తుగా ఇంట్లోని బహుమతుల పక్కన పెట్టేస్తారు.
అయితే.. కొన్నిసార్లు వాళ్లు అనుకున్నది జరగకపోవచ్చు. దాంతో, అరే ఆ జ్ఞాపికను కోల్పోయామే అనే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అవును.. తాను ప్రేమగా దాచుకోవాలనుకున్న 300వ వికెట్ తీసిన బంతి తనకు దొరకలేదని లియాన్ వాపోతున్నాడు. అసలు ఎందుకలా జరిగిందో వివరించాడిలా.
‘దక్షిణాఫ్రికా పర్యటనలో నేను కగిసో రబడ వికెట్ తీసి 300 టెస్టు వికెట్ సాధించాను. అయితే.. సాండ్ పేపర్ వివాదం కారణంగా ఆ బంతిని నా చేతికి రాలేదు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన నేను చివరకు ఖాళీ చేతులనే చూపించాల్సి వచ్చింది’ అని లియన్ వాపోయాడు. అసలు ఏం జరిగిందటే.. ఆసీస్ జట్టు 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
How Nathan Lyon became collateral damage in Australian sandpaper disgrace https://t.co/7vDBRRjHHa
— Mail Sport (@MailSport) November 9, 2024
కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ బ్యాంక్రాప్ట్లు సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. వాళ్లు అలా చేయడం వీడియోలో రికార్డు కావడంతో ఐసీసీ గుర్రుమంది. దాంతో, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది. వార్నర్, స్మిత్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక బ్యాన్‌క్రాఫ్ట్ మాత్రం 9 నెలలు ఆటకు దూరమయ్యాడు. సాండ్ పేపర్ వివాదం గురించి తెలియగానే మ్యాచ్ ఆఫీషియల్స్ ఆ రోజు ఉపయోగించిన బంతిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో, లియాన్‌కు ఆ బంతి ఇక మళ్లీ కనిపించలేదు.