Bandi Sanjay | తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.
కరీంనగర్‌లోని మమతా థియేటర్లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్‌లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు.
అబద్దాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని బండి సంజయ్ అన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదు.. తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్‌లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు చేశామని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇంకా 20 లక్షల మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు, నిరుద్యోగులుకు రూ.2 లక్షల మాఫీ, విద్యార్థులకు రూ5 లక్షల భరోసా కార్డు, వృద్ధులకు నెలనెలా రూ.4 వేల ఫించన్, పేదలందరికీ ఇండ్లు ఇచ్చారా? ఇవేమీ అమలు చేయకుండా మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. మహారాష్ట్రలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో కర్రు కాల్చి వాతపెట్టారని బండి సంజయ్ అన్నారు. ఈసారి మహారాష్ట్రలో కూడా అదే జరగబోతోందని అన్నారు. బీజేపీపై యుద్దం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. దేనికోసం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.