ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. నాలుగేండ్ల తర్వాత సొంతగడ్డపై బరిలోకి దిగిన రాయల్స్‌కు తొలి పోరులోనే చుక్కెదురైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో లక్నోను స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమైన రాయల్స్..బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకుంది. అవేశ్‌ఖాన్, స్టొయినిస్ రాణింపుతో లక్నో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
జైపూర్ : లీగ్‌లో టాప్‌లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బుధవారం ఆఖరి వరకు విజయం దోబూచులాడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై లక్నోదే పైచేయి అయ్యింది. లక్నో 10 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 154/7 స్కోరు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్(51), కేఎల్ రాహుల్(39) రాణించారు. అశ్విన్(2/23) రెండు వికెట్లు తీయగా, బౌల్ట్, సందీప్‌శర్మ, హోల్డర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రాయల్స్ 144/6 స్కోరుకు పరిమితమైంది. అవేశ్‌ఖాన్(3/25), స్టొయినిస్(2/28) ధాటికి రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్వల్ప లక్ష్యఛేదనలో బ్యాటర్ల వైఫల్యం రాయల్స్ కొంపముంచింది. యశస్వి జైస్వాల్(44), బట్లర్(40) రాణించారు. స్టొయినిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గురువారం ఐపీఎల్లో డబుల్ ధమాకా అలరించనుంది.
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. కెప్టెన్ నమ్మకాన్ని రాయల్స్ బౌలర్లు వమ్ము చేయలేదు. స్వింగ్స్టార్ బౌల్ట్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్ చేయగా, సహచర బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు సంధించారు. ఫలితంగా అడపాదడపా బౌండరీలతో లక్నో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ విడిచిపెట్టారు. తనకు వచ్చిన చాన్స్‌ను రాహుల్ చక్కగా సద్వినియోగం చేసుకోగా, మరోవైపు మేయర్స్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
వీరిద్దరు రాయల్స్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఫోర్లు, సిక్స్‌లు బాదారు. ఇన్నింగ్స్ జోరు అందుకుంటున్న తరుణంలో హోల్డర్ వేసిన స్లోబంతికి రాహుల్…బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఓవర్లో ఆయూశ్ బదోనీ(1)ని బౌల్ట్ క్లీన్‌బౌల్డ్‌తో పెవిలియన్ పంపాడు. క్రీజులో కుదురుకున్న మేయర్స్‌తో పాటు దీపక్ హుడా(2)ను అశ్విన్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో లక్నో కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో స్టొయినిస్, నికోలస్ పూరన్(29) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు సమయోచితంగా ఆడుతూ ఆఖర్లో బౌండరీలతో చెలరేగారు. సందీప్‌శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు కోల్పోయింది.
స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్లు బట్లర్(40), యశస్వి జైస్వాల్(44) లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ముఖ్యంగా మంచి ఫామ్‌మీదున్న బట్లర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. జైస్వాల్ మద్దతుతో కీలక పరుగులు జతచేశారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో రాయల్స్ అలవోకగా ఛేదిస్తుందనుకున్న తరుణంలో స్టొయినిస్ దెబ్బ తీశాడు. అవేశ్‌ఖాన్ క్యాచ్‌తో జైస్వాల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కణ్నుంచి రాయల్స్ కుదురుకోలేకపోయింది. కెప్టెన్ సంజూ శాంసన్(2) రానౌట్గా వెనుదిరుగగా, హెట్‌మైర్(2) నిరాశపరిచాడు. దేవదత్ పడిక్కల్(26), రియాన్ పరాగ్(15 నాటౌట్) ఆశలు రేపినా..రాయల్స్‌ను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. అవేశ్‌ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా, పడిక్కల్, జురెల్(0) వరుస బంతుల్లో ఔట్ కావడంతో లక్నో విజయం ఖరారైంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 154/7(మేయర్స్ 51, రాహుల్ 39, అశ్విన్ 2/23, బౌల్ట్ 1/16),
రాజస్థాన్: 20 ఓవర్లలో 144/6(జైస్వాల్ 44, బట్లర్ 40, అవేశ్‌ఖాన్ 3/25, స్టొయినిస్ 2/28)