LSG | నమస్తే తెలంగాణ క్రీడా : ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఆగమనమే ఓ సంచలనం. 2022లో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది. బంతిని బలంగా బాదే నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ వంటి హార్డ్ హిట్టర్లు.. మాజీ సారథి కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ నిలకడైన ఆటతీరు.. అయూష్ బదోని, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మోహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ వంటి వర్ధమాన క్రికెటర్ల మెరుపులతో ఆ జట్టు వరుసగా 2022, 2023 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి మూడో స్థానంలో నిలిచింది.
కానీ 2024లో మాత్రం తడబాటుకు గురై ఏడో స్థానంతో ముగించింది. తమతో పాటే లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్.. 2022లో టైటిల్ గెలవడంతో పాటు 2023లో ఫైనల్ చేరినా లక్నో మాత్రం రెండు సీజన్లలో టైటిల్‌కు దగ్గరగా వచ్చినా ఆ ముచ్చటను తీర్చుకోలేకపోయింది. ఈ సీజన్లో కొత్త కెప్టెన్ రిషభ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగనున్న లక్నో.. నాలుగో ప్రయత్నంలో అయినా కప్పు కలను నెరవేర్చుకుంటుందేమో చూడాలి.
ఐపీఎల్ 18 వేలంలో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరతో లక్నోకు సొంతమైన పంత్‌ను ఆ జట్టు సారథిగా నియమించింది. గత మూడు సీజన్ల పాటు నడిపించిన రాహుల్‌ను కాదనుకన్న గొయెంకా.. స్టోయినిస్, కృనాల్, డికాక్, పడిక్కల్ వంటి బ్యాటర్లను వేలానికి వదిలేసి జట్టును ప్రక్షాళన చేశారు. డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్మ్,్ర మిచెల్ మార్ష్, పూరన్, పంత్‌తో పాటు బదోని, అబ్దుల్ సమద్ వంటి దేశవాళీ హిట్టర్లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం దుర్బేధ్యంగా ఉంది.
ఏ క్షణంలో అయినా మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం వీరి సొంతం. సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా ఉన్న ఆ జట్టుకు బౌలింగ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ అత్యంత విలువైన ఆస్తి. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను విడదీయడంలో సిద్ధహస్తుడైన బిష్ణోయ్.. స్పిన్‌కు వేగం మిక్స్ చేసి వేసే గూగ్లీలకు ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. స్పిన్‌కు సహకరించే లక్నో ఏకనా పిచ్‌పై బిష్ణోయ్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు శక్తికి మించిన పనే.
బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూర్పు విషయంలో లక్నోకు తిప్పలు తప్పకపోవచ్చు. ఇక బిష్ణోయ్ మినహాయిస్తే లక్నో బౌలింగ్ విభాగం బలహీనంగానే ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా పేసర్లలో ఈ బలహీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యంగ్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమవనుండటం లక్నోకు ఎదురుదెబ్బే. అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, మోహ్సిన్ ఖాన్ ఏ మేరకు సత్తా చాటుతారనే దానిపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
2022, 2023 ప్లేఆఫ్స్
2024 ఏడో స్థానం