Virat Kohli | ఐపీఎల్-2025 సీజన్లో మంగళవారం ఆర్సీబీ-లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనున్నది. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన లక్నో.. ఈ సీజన్‌ను విజయంతో ముగించాలని భావిస్తున్నది. అదే సమయంలో లక్నోపై గెలిచి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలువాలని ఆర్సీబీ కృతనిశ్చయంతో ఉన్నది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని పలు రికార్డులకు చేరువయ్యాడు. లక్నోపై 24 పరుగులు చేస్తే ఐపీఎల్లో 9వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలువనున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ తరఫున విరాట్ ఆడుతున్న విషయం తెలిసిందే. 270 ఇన్సింగ్స్‌లో కోహ్లీ 8,976 పరుగులు చేశాడు.
14 ఛాంపియన్స్ లీగ్ టీ20ల్లో 424 పరుగులు చేయగా.. ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 8,552 పరుగులు చేశాడు. అలాగే, ఐపీఎల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ముందున్నారు. ఇద్దరు ఇప్పటి వరకు 62 సార్లు ఐపీఎల్లో హాఫ్ సెంచరీలు చేశారు. లక్నోతో మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే.. వార్నర్‌ను అధిగమించి.. ఐపీఎల్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ జాబితాలో 46 అర్ధ సెంచరీలతో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 548 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు కోహ్లీ ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు.
అయితే, విరాట్ ఒక సీజన్లో ఎక్కువగా హాఫ్ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 2016లో 11 హాఫ్ సెంచరీలు, 2023 సీజన్లో ఎనిమిది సెంచరీలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ లక్నోతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనూ విరాట్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీ ప్రస్తుతం 17 పాయింట్లతో మూడోస్థానంలో ఉండగా.. లక్నోపై విజయం సాధిస్తే రెండోస్థానానికి చేరుకుంటుంది. 2016 తర్వాత తొలిసారిగా టాప్-2లో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం గుజరాత్ రెండోస్థానంలో నిలువనున్నది. ఇక ఆర్సీబీ ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడగా.. ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించి.. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.