లక్నో: లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant)కు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 12 రన్స్ తేడాతో నెగ్గింది. బౌలింగ్ జట్టు 90 నిమిషాల్లో నిర్ణీత 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే 19 ఓవర్లు ముగిసే వరకు ఆ సమయం ముగిసిపోయింది.దీంతో లక్నో జట్టు చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ను కోల్పోవాల్సి వచ్చింది.
లక్నో జట్టు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కెప్టెన్ రిషబ్ పంత్‌కు 12 లక్షల జరిమానా విధించినట్లు చెప్పింది. మరో వైపు లక్నో బౌలర్ దిగ్వేశ్ రాతీకి రెండో సారి ఫైన్ పడింది. మ్యాచ్ ఫీజులో అతను 50 శాతం ఫైన్ కట్టాల్సి వచ్చింది.
ఐపీఎల్‌లోని లెవల్-1 ప్రవర్తనా నియమావళి కోడ్‌ను ఉల్లంఘించిన కేసులో అతనికి ఫైన్ వేశారు. నమన్ ధీర్‌ను ఔట్ చేసిన తర్వాత నోట్‌బుక్ టిక్ సెలబ్రేషన్ చేయడంతో రాతీకి జరిమానా విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. దీంతో అతని డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరుకున్నది. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ అతనికి ఫైన్ పడింది.