లండన్ : ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మహిళల టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిలు తొలి రోజు ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఈ పోరులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ధ శతకాలతో రాణించారు. ఆతిథ్య బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ మూడు, లారెన్ ఫిలర్, ఇసీ వాంగ్, మాడీ విలియర్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్‌లు తగిలాయి. ఓపెనర్ షఫాలీ వర్మ (0), యస్తికా భాటియా (12) నిరాశపరచడంతో 37/2తో భారత్ ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో వైస్ కెప్టెన్ మంధాన జట్టు బాధ్యతను భుజాన వేసుకుంది. జెమీమా (35)తో మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన స్మృతి తర్వాత హర్మన్‌తో కలిసి జట్టును 122/3 3 లంచ్‌కు తీసుకెళ్లింది. రెండో సెషన్లో మంధాన, హర్మన్ ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే, సెంచరీ వైపు దూసుకెళ్తున్న మంధానను ఇసీ వాంగ్ పెవిలియన్ చేర్చి ఆతిథ్య జట్టుకు కీలక బ్రేక్ ఇచ్చింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న హర్మన్ టీ విరామానికి ముందు ఔటవడంతో భారత్ 202/5తో రెండో సెషన్ ముగించింది. టీ బ్రేక్ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి బాధ్యతాయుతంగా ఆడింది. లోయర్ ఆర్డర్ సాయంతో కీలక పరుగులు రాబట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు చివరకు 11 ఓవర్లలో 21/1 స్కోరు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమోంట్ (2)ను క్రాంతి గౌడ్ ఎల్బీ చేయగా.. మయా బుషెర్ (17 బ్యాటింగ్), హెథర్ నైట్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 74.5 ఓవర్లలో 285 ఆలౌట్ (స్మృతి మంధాన 83, హర్మన్‌ప్రీత్ కౌర్ 58, దీప్తి శర్మ 57; సోఫీ ఎకిల్‌స్టోన్ 3/68, ఇసీ వాంగ్ 2/41). ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 11 ఓవర్లో 21/1 (బుషెర్ 17*, హెథర్ నైట్ 1*, క్రాంతి గౌడ్ 1/8)