Lionel Messi | తిరువనంతపురం: భారత్‌లో క్రికెట్‌తో పోల్చితే ఫుట్‌బాల్‌కు ఆశించిన స్థాయిలో క్రేజ్ లేకపోయినా అంతర్జాతీయ స్థాయిలో ఆడే స్టార్లకు మాత్రం ఇక్కడ ఆదరణ ఎక్కువే. ఆ జాబితాలో అగ్రస్థానాన ఉండే ఫుట్‌బాల్ ప్లేయర్లలో అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ముందువరుసలో ఉంటాడు. మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్ అంటే తెగ ఇష్టపడే కేరళలో మెస్సీ ఆరాధ్య దైవం. ఇక్కడి అభిమానులను తన విన్యాసాలతో అలరించడానికి గాను స్వయంగా మెస్సీ తన జట్టుతో పాటు వచ్చే ఏడాది కేరళకు రానున్నాడు.
మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2025లో కేరళ వేదికగా రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనున్నట్టు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘అవును.. వరల్డ్ నంబర్‌వన్ ఫుట్‌బాల్ టీమ్ అయిన అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టుతో మెస్సీ కూడా వస్తాడు’ అని అన్నారు. కేరళ ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించబోయే ఈ మ్యాచ్‌లకు రాష్ట్ర వ్యాపారస్తులు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. మ్యాచ్‌ల వేదిక, ప్రత్యర్థికి సంబంధించిన విషయాలను త్వరలో వెల్లడించనున్నట్టు అబ్దురహిమాన్ చెప్పారు.