తిరువనంతపురం : భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు శుభవార్త. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్, అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ఈ ఏడాది భారత్‌కు రానున్నాడు. కేరళలో రెండు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు గాను మెస్సీ.. అర్జెంటీనా జట్టుతో కలిసి అక్టోబర్‌లో భారత్‌కు విచ్చేయనున్నాడు. బుధవారం హెచ్ఎస్బీసీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి గాను అర్జెంటీనాతో ఒక ఏడాది ఒప్పందం కుదుర్చుకున్న హెచ్ఎస్బీసీ.. కేరళకు రానున్న అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. గతేడాది నవంబర్‌లో కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దుర్ రెహ్మాన్ ప్రత్యేకంగా అర్జెంటీనాకు వెళ్లి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడేందుకు ఆ దేశాన్ని ఒప్పించిన విషయం విదితమే.