ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా-ఈ కార్లు రయ్య్‌మ్రంటూ టాప్‌గేర్‌లో దూసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రేసులో ప్రపంచ ప్రముఖ రేసింగ్ కంపెనీలు హోరాహోరీగా తలపడేందుకు సై అంటున్నాయి. హుసేన్సాగర్ తీరాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్‌పై కార్లు రయ్‌మని పరుగులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తికాగా, నేటి నుంచి అభిమానుల సందడి మొదలుకానుంది. ప్రధాన రేసుకు సన్నాహకంగా జరిగే ఈ రేసు ద్వారా రేసర్లు ట్రాక్‌పై అవగాహనకు రానున్నారు. రెడీ టు గో అనడమే ఆలస్యం కార్లను పరుగులు పెట్టించేందుకు రేసర్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రేసును ఆస్వాదించేందుకు సిద్ధమైపోండి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు హైదరాబాద్ ముస్తాబైంది. భారత్‌లో తొలిసారి జరుగుతున్న రేసుకు మన భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో ఆధ్వర్యంలో జరుగుతున్న రేసు కోసం హుసేన్సాగర్ తీర ప్రాంతం కొత్త హంగులు అద్దుకుంది. ఇప్పటికే ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ద్వారా రేసింగ్‌ను ఆస్వాదించిన నగర అభిమానులకు ఫార్ములా-ఈ రూపంలో సరికొత్త మజా అందబోతున్నది. శుక్రవారం ప్రాక్టీస్ రేసు జరుగనుండగా, పాఠశాల విద్యార్థులు ఉచితంగా వీక్షించేందుకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు.
తొమ్మిదో సీజన్లో భాగంగా నాలుగో రేసు హైదరాబాద్ వేదిక అవుతున్నది. మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు బరిలోకి దిగుతున్నారు. గత ఎనిమిది సీజన్లుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఫార్ములా-ఈ మొట్టమొదటిసారి భారత్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నది. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పేరిట జరుగనున్న రేసుకు సంబంధించిన ఫార్ములా-ఈ సీఈవో జామీ రిగిల్ మాట్లాడుతూ ‘ఈ సీజన్ ద్వారా జెన్-3కార్లను రేసింగ్‌లోకి తీసుకొచ్చాం. సరికొత్త సాంకేతికతను జోడిస్తూ మరింత తేలికగా, వేగంగా రూపొందించిన కార్లు హైదరాబాద్ సర్క్యూట్లో రయ్‌మంటూ దూసుకెళుతాయి.
గంటకు 320కి.మీ వేగంతో 350కేడబ్ల్యూ సామర్థ్యం కల్గిన జెన్ 3 కార్లు టెక్నాలజీ పరంగా అత్యుత్తమంగా నిలుస్తాయి. ఫైటర్ జెట్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందుతూ కార్లను రూపొందించడం జరిగింది. బ్రేకింగ్ ద్వారా 40 శాతం శక్తిని తిరిగి పొందడం వీటి ప్రత్యేకత. ఇరుకైన, కుదించిన రోడ్లపై రూపొందించిన సర్క్యూట్లో షార్ట్ వీల్‌బేస్‌తో కార్ నడపడం మజాను అందిస్తుంది. వాతవరణ కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో రూపొందించిన కార్లతో రేసింగ్ రసవత్తరంగా సాగుతుంది’ అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి:
‘ఫార్ములా-ఈ రేసింగ్ విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. నగరం మధ్యలో స్ట్రీట్ సర్య్యూట్ బేస్‌గా జరుగనున్న రేసు కోసం వివిధ అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరించింది. నగరం మధ్యలో జరుగనున్న రేసు కోసం చాలా కష్టపడుతున్నాం. రేసింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్ మొత్తం రిసైకిల్డ్ వేస్ట్‌తో తయారు చేసినవే. ఎక్కడా పర్యావరణానికి హాని కలుగని రీతిలో ఏర్పాట్లు ఉంటాయి. భారత్‌లో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని 4 ఏండ్ల పాటు స్థానిక ప్రమోటర్లు గ్రీన్‌కోతో ఒప్పందం చేసుకున్నాం’ అని జామీ పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ నేటి షెడ్యూల్
మ: 12.30-12.45 వరకు ప్రెస్‌మీట్ (టీమ్ ప్రతినిధులు)
మ: 12.45-1.00 వరకు ప్రెస్ మీట్(డ్రైవర్స్)
మ: 1.30 -2.00 వరకు మీడియా సేఫ్టీ బ్రీఫింగ్
మ: 2.30-2.45 వరకు షేక్డౌన్
సా: 4.30 నుంచి 5.00 వరకు ఫ్రీ ప్రాక్టీస్ 1
భారత్‌లో తొలిసారి జరుగుతున్న రేసు కోసం మేము ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. రేసింగ్‌ను ఆస్వాదించేందుకు అభిమానులందరీని అహ్వానిస్తున్నాం. ట్రాక్‌పై కార్లను పరుగులు పెట్టించేందుకు ఆతృతతో ఉన్నాం. జెన్ 2 కార్లతో రేసింగ్‌ను ఎంజాయ్ చేశాం. అన్ని రకాలుగా ఆ కార్లను తీర్చిదిద్దారు. వాటి స్థానంలో వచ్చిన జెన్ 3 కార్లు మరింత శక్తివంతంగా తయారు చేశారు. ట్రాక్‌పై అత్యుత్తమ టైమింగ్‌తో రేసు ముగించాలన్నదే మా లక్ష్యం.