Vandana Katariya : భారత మహిళల హాకీ జట్టు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన వందనా కటారియా (Vandana Katariya) వీడ్కోలు పలికింది. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆమె 32 ఏళ్ల వయసులో మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించింది. 15 ఏళ్ల తన సుదీర్ఘ కెరియర్‌కు అల్విదా చెప్పడం బాధగానే వెల్లడించింది వందన. తనకెంతో ఇష్టమైన హాకీకి వీడ్కోలు పలుకుతున్నందుకు మనసులో బాధగానే ఉందని.. అయినా సరే నిర్ణయం తీసుకోలేక తప్పదని చెప్పింది వందన.
’15 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించాను. నాలో చేవ తగ్గిందని వైదొలగడం లేదు. ప్రస్తుతం కెరియర్లో ఉన్నత స్థితిలో ఉన్నాను. ఫామ్‌లేమితో జట్టుకు దూరమైనప్పుడు కాకుండా.. నేను ఈ సమయంలోనే రిటైర్మెంట్ తీసుకోవడం సముచితంగా ఉంటుందని భావించాను. ఇప్పటికీ నేను గొప్పగా ఆడగలను’ అని ఫార్వర్డ్ ప్లేయర్ తెలిపింది. చివరిసారిగా టీమిండియా తరఫున భువనేశ్వర్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2024-25లో ఆడింది వందన.
𝑺𝒐𝒎𝒆 𝒋𝒐𝒖𝒓𝒏𝒆𝒚𝒔 𝒕𝒓𝒂𝒏𝒔𝒄𝒆𝒏𝒅 𝒕𝒉𝒆 𝒈𝒂𝒎𝒆.🏑
Vandana Katariya ➡️320 matches, 158 goals and a legacy that will inspire generations.
From a historic hat-trick at Tokyo 2020 to countless unforgettable moments, she has redefined excellence in Indian hockey.… pic.twitter.com/9tgZPqj4KU— Hockey India (@TheHockeyIndia) April 1, 2025
‘వీడ్కోలు పలకాలని నిర్ణయించుకోవడం తేలికేమి కాదు. ఇదే సరైన సమయం అని భావించాను. నాకు హాకీ ఆరోప్రాణం లాంటిది. టీమిండియా జెర్సీ ధరించడం నాకు లభించిన గొప్ప గౌరవం. అయితే.. ప్రతి ప్రయాణానికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు ఉంటుంది. ప్రస్తుతం ఎంతో గర్వంగా, కృతజ్ఞతాభావంతో ఆట నుంచి వైదొలుగుతున్నా. ఇన్నేళ్ల కెరియర్లో నాకు మద్దతుగా నిలిచిన కోచ్‌లు, సహచరులు, సహాయక సిబ్బంది.. హాకీ ఇండియా, నా కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన విడ్కోలు సందేశంలో చెప్పింది వందన.
ఫార్వర్డ్ ప్లేయర్ అయిన వందన 15 ఏళ్ల తన సుదీర్ఘ కెరియర్లో దేశం తరఫున 320 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. తద్వారా బ్లూ జెర్సీతో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. మైదానంలో మెరికలా కదులుతూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేసే తను 158 గోల్స్ సాధించిందీ ప్లేయర్.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన వందనకు చిన్నప్పటి నుంచి హాకీ అంటే ఇష్టం. ఆ ఆటనే ప్రాణంగా ప్రేమించిన తను 2009లో సీనియర్ జట్టుకు ఎంపికైంది. అసమాన ప్రతిభాపాటవాలతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే భారత మహిళల హాకీ జట్టు సాధించిన అద్భుత విజయాల్లో భాగమైంది. 206, 2023లో మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణ పతకం గెలవడంలో వందన పాత్ర మరువలేనిది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన ఈమె టీమిండియా 4వ స్థానంలో నిలవడంలో ముఖ్య భూమిక పోషించింది.