దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేండ్ల సుదీర్ఘ వ్యవధిలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించింది. చోకర్స్ ముద్రను చెరిపేస్తూ నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సఫారీలు సత్తాచాటారు. మెగాటోర్నీలో మొదటి పోరులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి కసితీరా ప్రతీకారం తీర్చుకున్నారు. కెప్టెన్ లారా వోల్వార్డ్ సూపర్ సెంచరీతో కదంతొక్కిన వేళ భారీ స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా..ఇంగ్లండ్‌ను సెమీస్‌లోనే ఇంటికి పంపింది. సీనియర్ పేసర్ మారిజానె కాప్ ఐదు వికెట్ల విజృంభణతో ఒక పరుగుకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
గువాహటి: ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సంచలనం సృష్టించింది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న వరల్డ్‌కప్ ఫైనల్ బెర్తును ఎట్టకేలకు చేరుకుంది. అటు పురుషులతో పాటు మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో తొలిసారి టైటిల్ పోరుకు దక్షిణాఫ్రికా అర్హత సాధించి తమ పవర్ ఏంటో చేతల్లో చూపింది. బుధవారం జరిగిన మొదటి సెమీస్‌లో సఫారీలు 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించారు. తొలుత కెప్టెన్ లారా వోల్వార్డ్(143 బంతుల్లో 169, 20ఫోర్లు, 4సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు తజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42) రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 319/7 స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ వోల్వార్డ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కదంతొక్కింది. ఈ క్రమంలో నాకౌట్ పోరులో అత్యధిక పరుగులు చేసిన మొదటి కెప్టెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఎకల్‌స్టోన్(4/44), బెల్(2/55) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో కాప్(5/20) ధాటికి ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. నాట్‌సీవర్ బ్రంట్(64), అలైస్ కాప్సె(50) అర్ధసెంచరీలతో ఫర్వాలేదనిపించారు. భారీ సెంచరీతో జట్టుకు చారిత్రక విజయం అందించిన వోల్వార్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
వోల్వార్డ్ ధమాకా : మెగాటోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికా దీటైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. మెగాటోర్నీల్లో ప్రతీసారి తమకు కొరకరాని కొయ్యగా మారిన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సఫారీలు సగర్వంగా తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. వోల్వార్డ్, బ్రిట్స్..జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని తిప్పికొడుతూ అలవోకగా పరుగులు సాధించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో సెంచరీ మార్క్ అందుకున్న వోల్వార్డ్ సూపర్షాట్లతో అలరించింది. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన ఎకల్‌స్టోన్..బ్రిట్స్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బాచ్(0), లుస్(1) వెంటవెంటనే ఔటైనా వోల్వార్డ్ తన దూకుడు తగ్గించలేదు. మిడిల్లో వచ్చిన కాప్‌తో కలిసి వోల్వార్డ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసింది. ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఈ సఫారీ కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లో 20ఫోర్లు, 4 భారీ సిక్స్‌లు బాదింది. కాప్ ఔటైన తర్వాత జాఫ్టా (1), డెర్క్సన్ (4) పెవిలియన్ చేరినా..ట్రయాన్(33)తో కలిసి వోల్వార్డ్ జట్టు స్కోరు 300 దాటించింది. ఆఖర్లో స్మిత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డ సఫారీ కెప్టెన్..బెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది.
కాప్ ఖతర్నాక్ : ఇంగ్లండ్‌ను కాప్ ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. తన సూపర్ స్వింగ్‌తో ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లు జోన్స్(0), హీథర్ నైట్(0),బౌమౌంట్(0)ను పెవిలియన్ పంపింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను నాట్‌సీవర్, కాప్సె ఒడ్డున పడేసే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న నాట్‌సీవర్‌ను కాప్ ఔట్ చేయడం ద్వారా మళ్లీ దెబ్బకొట్టింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ భారీ ఓటమిని ఖాతాలో వేసుకుంది.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 319/7(వోల్వార్డ్ 169, బ్రిట్స్ 45, ఎకల్‌స్టోన్ 4/44, బెల్ 2/55),
ఇంగ్లండ్: 42.3 ఓవర్లలో 194 ఆలౌట్(నాట్‌సీవర్ 64, కాప్సె 50, కాప్ 5/20, డీక్లెర్క్ 2/24)