Lakshya Sen : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) కొద్దిలో కాంస్యం చేజార్చుకున్న విషయం తెలిసిందే. కుడి మోచేతి పట్టీలు వేసుకొని మరీ పోరాడిన అతడు చివరకు ఓటమితో నిరాశపరిచాడు. కాంస్య పోరు అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న లక్ష్య సేన్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) ఓదార్చిందట. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ తాజాగా వెల్లడించాడు. ఆ రోజు దీపిక ఫోన్ చేసిన నాతో మాట్లాడి ధైర్యం చెప్పిందని సేన్ తెలిపాడు.
‘మలేషియా షట్లర్‌తో మ్యాచ్‌లో ఓడాక నాకు దీపికా పదుకోన్ నాకు ఫోన్ చేసి మాట్లాడింది. ఓడినందుకు ఏమీ బాధ పడకు. నువ్వు చాలా బాగా ఆడావు అని దీపిక నన్ను ఓదార్చింది. అయితే.. దేశానికి పతకం సాధించిపెట్టనుందుకు నేను చాలా ఆవేదనకు గురయ్యాను’ అని లక్ష్య సేన్ వెల్లడించాడు.
అంతేకాదు విశ్వ క్రీడల సమయంలో కోచ్ విమల్ కుమార్(Vimal Kumar), మెంటర్ ప్రకాశ్ పదుకొనేలు తనకు ఎంతో మద్దతుగా నిలిచారని అతడు చెప్పాడు. ‘ఒలింపిక్స్ ఆసాంతం విమల్ సర్, ప్రకాశ్ సర్ నాకెంతో సపోర్ట్ చేశారు. ప్రకాశ్ సర్ నాకు మెంటార్ మాత్రమే కాదు తండ్రి సమానుడు కూడా. వాళ్ల నుంచి సలహాలు తీసుకోవడం, వాళ్లతో ఫ్రీగా మాట్లాడడం నాకు ఎంతో నచ్చింది’ అని లక్ష్యసేన్ వెల్లడించాడు.
ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్ చేరిన లక్ష్యసేన్ పతకం సాధించడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ, వరుసగా సెమీస్‌లో విక్టర్ అక్సెల్సెన్(Victor Axelsen) చేతిలో ఓడిన ఈ యువ కెరటం ఆ తర్వాత మలేషియా షట్లర్ లీ జీ జియా (Lee Zii Jia) చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దాంతో, మోచేతి గాయం లక్ష్యసేన్ మెడల్ ఆశల్నీ నాశనం చేసిందని యావత్ భారత్ సరిపెట్టుకుంది. కానీ, అతడి కోచ్ విమల్ కుమార్ (Vimal Kumar) మాత్రం ఒలింపిక్స్ ఓటమిని తేలికగా తీసుకోవడం లేదు. లక్ష్యసేన్ ఫిట్నెస్ పరంగా మెరుగవ్వాల్సిన సమయం వచ్చిందని, అప్పుడే అతడు మరిన్ని పతకాలు గెలుస్తాడని ఆయన అంటున్నాడు.