అమరావతి : ఏపీలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్(Eluru Mayor) షేక్ నూర్జహాన్ (Sheikh Noorjahan) మంగళవారం తెలుగుదేశం (టీడీపీ)పార్టీలో చేరారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు, ఈయూడీఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి నారా లోకేష్(Minister Lokesh) ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరామని, అయితే అక్కడికి వెళ్లాక ఏలూరు నగరాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయామని పేర్కొన్నారు. మరో 40 మంది ఏలూరు కార్పొరేటర్లు (Corporators) టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వెల్లడించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ గుణపాఠం నేర్చుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు కాక ముందే ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని వెల్లడించారు.