Paris Olympics | పారిస్: ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. దేశానికి పక్కాగా పతకం పట్టుకొస్తారని భారీ ఆశలు పెట్టుకున్న ప్రధాన క్రీడాకారులంతా దారుణంగా విఫలమై ఇంటిబాట పట్టారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రయాణం ముగిసింది.
మూడో పతకం వేటలో ఉన్న పీవీ సింధు..??? పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఒక్కడే ముందంజ వేశాడు. టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. ఆర్చర్ ప్రవీణ్ జాదవ్ నిరాశపరచగా హాకీలో మెన్ ఇన్ బ్లూకు తొలి ఓటమి ఎదురైంది. షూటింగ్, అథ్లెటిక్స్, సెయిలింగ్‌లో భారత క్రీడాకారులు అర్హత రౌండ్లకు కూడా చేరలేక చతికిలపడ్డారు.
విశ్వక్రీడలకు ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఇందూరు అమ్మాయి నిఖత్ జరీన్‌కు మహిళల 50 కిలోల విభాగంలో అనూహ్య పరాభవం ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ 0-5తో చైనా బాక్సర్ వు హు చేతిలో ఓడింది. మూడు బౌట్స్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన వు హు పంచ్ పవర్ ధాటికి నిఖత్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఓటమి అనంతరం ఆమె కన్నీటిపర్యంతమైంది. పురుషుల 71 కిలోల విభాగంలో నిషాంత్ దేవ్ 3-2తో జోస్ గాబ్రియెల్ (ఈక్వెడార్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫికేషన్ రౌండ్లో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న సిఫ్ట్‌కౌర్ సమ్ర తీవ్రంగా నిరాశపరిచింది. 32 మంది పాల్గొన్న ఈ రౌండ్లో ఆమె 31వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో వెటరన్ అంజుమ్ గాడ్గిల్ 18వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఆర్చరీ పురుషుల విభాగంలో ఉన్న ఏకైక ఆర్చర్ ప్రవీణ్ జాదవ్.. 0-6తో కవొ వెంచవొ (చైనా) ఓటమిపాలయ్యాడు. అథ్లెటిక్స్ విభాగంలో భాగంగా పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో వికాస్ సింగ్ (30), బిసత్ (37) టాప్-25లోకి కూడా రాలేదు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 41వ స్థానంతో ముగించింది. సెయిలింగ్ మెన్స్ కేటగిరీలో శరవణన్ 25వ స్థానంలో నిలిచాడు.
ఇక హాకీలో క్వార్టర్స్ దిశగా సాగుతున్న భారత్‌కు బెల్జియం షాకిచ్చింది. పూల్ బీ నాలుగో మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌పై గెలిచింది. 18వ నిమిషంలో అభిషేక్ గోల్ చేయగా బెల్జియం నుంచి జాన్ (33), డొహ్మెన్ (44) రెండు గోల్స్ కొట్టారు. టేబుల్ టెన్నిస్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆకుల శ్రీజ.. 0-4తో సున్ యింగ్ష (చైనా) చేతిలో ఓటమిపాలైంది.