Kuldeep Yadav : పొట్టి వరల్డ్ కప్ హీరో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఆస్ట్రేలియాలో విహరిస్తున్నాడు. కుటుంబంతో కలిసి అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. శుక్రవారం ఈ ఆఫ్ స్పిన్నర్ మెల్బోర్న్ క్రికెట్ మైదానా(MCG)న్ని సందర్శించాడు. అక్కడ తన ఆరాధ్య బౌలర్, దివంగత షేన్ వార్న్(Shane Warne) నిలువెత్తు విగ్రహాన్నిచూసి కుల్దీప్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఎంసీజీలో వార్న్ విగ్రహం ముందు దిగిన ఫొటోలను ‘బౌలింగ్ చేస్తున్న షేన్.. ఎప్పుడూ.. ఎల్లప్పుడూ’ అనే క్యాప్షన్‌తో కుల్దీప్ తన ఎక్స్‌లో పెట్టాడు. ‘వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. అతడిని గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు చాలా బాధగా ఉంటుంది. మా కుటుంబసభ్యుల్లో ఒకరిని కోల్పోయానని అనిపిస్తుంది’ అని కుల్దీప్ అన్నాడు.
Bowling Shane…. Always & Forever. pic.twitter.com/Dlb34fPnjp
— Kuldeep yadav (@imkuldeep18) August 23, 2024
వరల్డ్ కప్ బ్రేక్ అనంతరం ఆస్ట్రేలియాలో వాలిపోయిన కుల్దీప్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడికి క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే ఘన స్వాగతం పలికాడు. ఆ తర్వాత కుల్దీప్ ఎంసీజీలోని వార్న్ నిలువెత్తు విగ్రహాన్ని సందర్శించాడు. ‘క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయం, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉండడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి నా దృష్టంతా రాబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) మీదే ఉంది. ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర టెస్టు సమరం జరుగుతుందని భావిస్తున్నా’ అని కుల్దీప్ వెల్లడించాడు.
వార్న్‌తో కుల్దీప్
‘నేను ఆఫ్ స్పిన్నర్ కాదు లెగ్ స్పిన్నర్’ అని చెప్పే కుల్దీప్పై వార్న్ ప్రభావం చాలానే ఉంది. 2018-19లో భారత జట్టు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచింది. అప్పుడు జట్టులో ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవే. దాంతో, వార్న్ టీమిండియా నెట్స్‌లోకి వెళ్లి అతడికి విలువైన సలహాలు ఇచ్చేవాడు. ఆ పర్యటనలో కుల్దీప్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించిన అతడు 99 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను అతడు వార్న్‌కు అంకితం చేశాడు.