శంషాబాద్ రూరల్, ఆగస్టు 23 : కల్తీ మసాలలు(Adulterated spices) తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో గుట్టచప్పుడు కాకుండా కల్తీ మసాలలు తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కల్తీ మసాలలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకున్నారు.
పహాడిషరీప్ శ్రీరామ్కాలనీకి చెందిన చంద్రప్రకాశ్, శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామానికి చెందిన ఉజ్మారామ్ ఇద్దరిని విచారణ చేయగా మసాలాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి నాణ్యత పాటించకపోవడంతో పాటు ప్రజల ఆరోగ్యంతో ఆటాలడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితులపై ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.